information

Post Office Rs 500 Schemes : నెల‌కు రూ.500 పొదుపు చేస్తే చాలు.. రూ.4 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

Post Office Rs 500 Schemes : స‌మాజంలో ఉన్న అంద‌రూ డ‌బ్బు సంపాదిస్తారు. అలాగే సంపాదించే డ‌బ్బును పొదుపు చేయాల‌ని కూడా చూస్తుంటారు. త‌మ‌కు ఆదాయంలో ఎంతో కొంతైనా పొదుపు చేయ‌గ‌లిగితే అది భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ప‌నిచేస్తుంద‌ని భావిస్తారు. అందుక‌నే చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. ఇక అలాంటి వారి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అనేక ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక పోస్టాఫీస్‌లోనూ డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు ప‌లు ర‌కాల ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి.

అయితే డ‌బ్బు పొదుపు చేయాలంటే నెల నెలా భారీ ఎత్తున పెట్టాల్సిన ప‌నిలేదు. నెల‌కు కేవ‌లం రూ.500 ఉన్నా చాలు. మీరు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకోవ‌చ్చు. అందుకు ప‌లు పోస్టాఫీస్ స్కీమ్‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ ప‌థ‌కాలు మెచూరిటీ తీరిన త‌రువాత మీకు పెద్ద మొత్తంలో డ‌బ్బును అందజేస్తాయి. పైగా పోస్టాఫీస్‌లు కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డ‌తాయి క‌నుక మీరు పొదుపు చేసుకునే డబ్బుకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక పోస్టాఫీస్‌లో నెల‌కు కేవ‌లం రూ.500 క‌డుతూ డ‌బ్బును పొదుపు చేసుకునే ప‌థ‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

do you know these rs 500 schemes available in post office

పీపీఎఫ్ ప‌థ‌కం..

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌. దీన్నే PPF అని కూడా అంటారు. ఈ స్కీమ్‌ను ప్ర‌స్తుతం దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా అందిస్తున్నాయి. అయితే దీన్ని మీరు పోస్టాఫీస్‌లోనూ ప్రారంభించ‌వ‌చ్చు. ఇందులో నెల‌కు రూ.500 క‌ట్టినా చాలు PPF ఖాతాను తెర‌వ‌చ్చు. ఇందులో మీరు ఏడాదికి క‌నీసం రూ.500, గ‌రిష్టంగా రూ.1.50 ల‌క్ష‌ల‌ను పొదుపు చేయ‌వ‌చ్చు. ఈ మొత్తాన్ని మీరు నెల నెలా క‌ట్ట‌వ‌చ్చు లేదా ఒకేసారి క‌ట్ట‌వ‌చ్చు. ఇక మీరు ఈ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే దీని మెచూరిటీ కాలం 15 ఏళ్లు క‌నుక ఆ త‌రువాత మీరు డ‌బ్బు మొత్తాన్ని పొంద‌వ‌చ్చు. కానీ 15 ఏళ్లు అయ్యాక కూడా ఈ ప‌థ‌కాన్ని మ‌రో 2 సార్లు 5 ఏళ్ల చొప్పున పెంచుకోవ‌చ్చు. దీంతో ఈ ప‌థ‌కంలో మీరు మొత్తం 25 ఏళ్ల పాటు డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు.

ఇక PPF లో మీరు నెల‌కు రూ.500 పొదుపు చేస్తే అవి సంవ‌త్స‌రానికి రూ.6000 అవుతాయి. దీనికి ప్ర‌భుత్వం అందిస్తున్న వ‌డ్డీ 7.1 శాతంగా ఉంది. దీని ప్ర‌కారం చూస్తే 15 ఏళ్ల‌లో మీకు మొత్తం రూ.1,62,728 అందుతాయి. మ‌రో 5 ఏళ్లు పొడిగిస్తే రూ.2,66,332 పొంద‌వ‌చ్చు. ఇంకో 5 ఏళ్లు పొడిగిస్తే మొత్తంగా మీరు రూ.4,12,321 పొంద‌వ‌చ్చు. ఇలా ఈ ప‌థ‌కంలో కేవ‌లం రూ.500 నెల‌కు పొదుపు చేసినా చాలు.. మీరు ఏకంగా మెచూరిటీ అనంతరం రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. వీటిని మీరు భ‌విష్య‌త్తులో వ‌చ్చే అవ‌స‌రాల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌..

ఇక పోస్టాఫీస్‌లోనే మ‌రో ప‌థ‌కం అందుబాటులో ఉంది. అదే సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ప‌థ‌కం. దీని గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తె కోసం ఈ ప‌థ‌కంలో డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. ఇందులో కూడా నెల‌కు క‌నీసం రూ.500 పొదుపు చేయ‌వ‌చ్చు. ఏడాదికి గ‌రిష్టంగా రూ.1.50 ల‌క్ష‌ల‌ను పొదుపు చేసుకోవ‌చ్చు. ఇందులో ప్ర‌స్తుతం 8.2 శాతం వ‌డ్డీని అందిస్తున్నారు. ఈ ప‌థ‌కం కాల‌వ్య‌వ‌ధి 15 ఏళ్లు. కానీ మీ కుమార్తెకు 21 ఏళ్లు నిండిన త‌రువాతే ఈ ప‌థ‌కం మెచూర్ అవుతుంది. అప్పుడే డ‌బ్బులను తీసుకోవ‌చ్చు. ఇక ఇందులో మీరు నెల‌కు రూ.500 పొదుపు చేస్తే 15 ఏళ్ల‌కు ఆ మొత్తం రూ.90వేలు అవుతాయ‌. దీనికి 8.2 శాతం వ‌డ్డీ వ‌స్తుంది. దీంతో 21 ఏళ్ల త‌రువాత మీకు మొత్తం రూ.2,77,103 వ‌స్తాయి. ఈ మొత్తాన్ని మీరు మీ కుమార్తె పెళ్లి లేదా చ‌దువుల కోసం ఉప‌యోగించ‌వ‌చ్చు.

రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌..

ఇక పోస్టాఫీస్‌లోనే నెల‌కు రూ.500 పొదుపు చేసుకునే మ‌రో స్కీమ్ ఉంది. అదే పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌. దీని గురించి కూడా చాలా మందికి తెలుసు. ఇందులో నెల‌కు రూ.500 పొదుపు చేయ‌వ‌చ్చు. ఈ స్కీమ్ కాల‌వ్య‌వ‌ధి 5 ఏళ్లు మాత్ర‌మే. అందువ‌ల్ల 5 ఏళ్ల అనంత‌రం వ‌చ్చే ఖ‌ర్చుల‌ను భ‌రించేందుకు ఈ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. ఇక ఇందులో నెల‌కు రూ.500 పొదుపు చేస్తే 5 ఏళ్ల‌కు అవి రూ.30వేలు అవుతాయి. దీనిపై 6.7 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. మొత్తంగా 5 ఏళ్ల అనంత‌రం ఈ ప‌థ‌కం ద్వారా రూ.35,681 పొంద‌వ‌చ్చు. అంటే రూ.5,681 వ‌డ్డీ వ‌స్తుంద‌న్న‌మాట‌. ఇలా ఈ ప‌థ‌కాల్లో నెల‌కు రూ.500 పొదుపు చేసినా చాలు, ఎంతో ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts