గ్రామీణ మహిళలను సంపన్నులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం’లఖ్ పతి దీదీ’ పథకాన్ని ఆగస్టు 15, 2023న తీసుకొచ్చిన విషయం తెలిసిందే.మహిళలని బలోపేతం చేసేందుకు ఈ పథకం తీసుకొచ్చారు. ఈ పథకం కింద మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తారు. దీంతో ఏడాదికి లక్ష రూపాయలకు పైగా సంపాదించేలా స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తారు. అలాగే వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తారు. మహిళలు సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రుణాలు అందిస్తారు. లఖపతి దీదీ యోజనను పొందేందుకు మహిళలు తప్పనిసరిగా స్వయం సహాయక బృందం లో చేరాలి. ఈ సమూహాలు రుణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి. అలాగే అవసరమైన సహాయాన్ని అందిస్తాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఎస్‌హెచ్ జీలు మహిళలు విజయవంతం కావడానికి అవసరమైన వనరులను పొందేలా చూస్తాయి.
ఈ పథకం కింద గ్రామాల్లో వ్యవసాయ కార్యకలాపాల కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు అందిస్తుంది. దాదాపు 15,000 మంది మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడంలో నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. దీంతో పాటు ఈ పథకం కింద మహిళలకు ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్ వంటి నైపుణ్యాల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. లఖపతి దీదీ పథకంలో చేరడానికి మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. స్వయం సహాయక సంఘాలలోని మహిళలు మాత్రమే ఈ పథకంలో చేరగలరు. మీరు జిల్లా మహిళా అలాగే శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని సందర్శించి లఖపతి దీదీ పథకానికి సంబంధించిన ఫామ్‌ను పొందవచ్చు.
ముందుగా ఈ పథకాన్ని మొదట రాజస్థాన్ ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తరువాత మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. ఇది 23 డిసెంబర్ 2023న ప్రారంభించారు. కేంద్రప్రభుత్వం అమలు చేసిన తర్వాత, చాలా మంది మహిళలు దీని ప్రయోజనాలను పొందుతున్నారు. లఖ్ పతి దీదీ యోజన స్కీమ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ అందుబాటులో ఉంచుకోండి.
ముందుగా స్థానిక స్వయం సహాయక గ్రూపులో చేరండి.అంగన్‌వాడీ కేంద్రంలో ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. అలా దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకత్వం చేస్తారు. లఖ్ పతి దీదీ యోజన కోసం దరఖాస్తు ఫారమ్‌ను పొంది, వివరాలు పూరించండి.ఆపై నిర్దేశించిన కార్యాలయం లేదా అంగన్‌వాడీ కేంద్రంలో అవసరమైన అన్ని పత్రాలతో దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. అనంతరం మీ దరఖాస్తు అర్హతపై ధృవీకరణ ప్రక్రియకు వెళుతుంది.