Sukanya Samriddhi Yojana : సమాజంలో బాలికల పట్ల నెలకొన్న వివక్షకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 జనవరిలో బేటీ బచావో, బేటీ పఢావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆడపిల్లలను సంరక్షించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం పనిచేస్తుంది. అలాగే ఆడపిల్ల పెరిగి పెదయ్యాక ఆమె పెళ్లితోపాటు ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును సొంతంగా భరించేందుకు గాను కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కూడా అమలులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకం కింద ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే వారి పేరిట ఏడాదికి కొంత మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేస్తే చాలు.. వారు పెరిగి పెద్దయ్యే సరికి వారి ఖర్చులకు ఎక్కడా చేయి చాచాల్సిన పని ఉండదు.
సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రయోజనాలను పొందాలంటే ఆడపిల్లల వయస్సు 10 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే పోస్టాఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఆడపిల్ల పేరిట బ్యాంకు ఖాతా తెరచి ఉండాలి. సుకన్య సమృద్ధి యోజన పథకం పొందేందుకు తల్లిదండ్రులు దిగువ తెలిపిన ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల్లో ఆడపిల్లల పేరిట అకౌంట్లను తెరవవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్ తదితర బ్యాంకులలో ఖాతా తెరవచ్చు.
పైన తెలిపిన బ్యాంక్‌లలో ఆడపిల్లల పేరిట వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. ఇద్దరు పిల్లలు ఉంటే విడివిడిగా ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అంతకు మించి సంఖ్య పెరిగినా విడివిడిగానే ఖాతాలను తెరవాలి. సుకన్య సమృద్ధి యోజన పథకం కింద బ్యాంకుల్లో అకౌంట్లను తెరవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పిల్లల బర్త్ సర్టిఫికెట్ (హాస్పిటల్ వారు ఇచ్చింది లేదా తహసీల్దార్, ఇతర ప్రభుత్వ అధికారులు ఇచ్చింది ఏదైనా ఫర్వాలేదు). తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అడ్రస్ ప్రూఫ్ (పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఎలక్ట్రిసిటీ లేదా టెలిఫోన్ బిల్లు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు లేదా భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర చిరునామా ధ్రువీకరణ పత్రమైనా సరిపోతుంది).
తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఐడీ ప్రూఫ్ (పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ లేదా ఇతర ఏ ఐడీ ప్రూఫ్ ఉన్నా చాలు). సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఓపెన్ చేసే బ్యాంక్ అకౌంట్‌ను దేశంలోని ఇతర ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన పక్షంలోనే సంరక్షకుల బాధ్యత చెల్లుతుంది. అలాగే ఆడపిల్లకు 10 సంవత్సరాలు దాటిన అనంతరం ఆమె అనుమతితో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బ్యాంక్ అకౌంట్ నిర్వహణ బాధ్యతలు తీసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆడపిల్ల ఖాతాలో ఏడాదికి కచ్చితంగా రూ.250 జమచేయాలి. అంతకు ముందు ఈ పరిమితి రూ.1000 ఉండేది. ఇక గరిష్టంగా ఖాతాలో రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే ఈ మొత్తాన్ని ఎన్ని విడతల్లో అయినా డిపాజిట్ చేయవచ్చు. కానీ మొత్తం సొమ్ము డిపాజిట్ రూ.1.50 లక్షలు మించరాదు. అయితే ఏడాదికి డిపాజిట్ చేయాల్సిన కనీస సొమ్ము రూ.250 కూడా డిపాజిట్ చేయకపోతే అలాంటి అకౌంట్లను డీయాక్టివేట్ చేస్తారు. అయితే మళ్లీ రూ.50 జరిమానా చెల్లించి అకౌంట్‌ను యాక్టివేట్ చేయించుకుని తిరిగి ఎప్పటిలా అందులో సొమ్ము డిపాజిట్ చేయవచ్చు.
ఈ పథకం కింద ఏడాదికి గాను 8.1 శాతం వడ్డీ చెల్లిస్తారు. అలాగే ప్రతి ఏటా జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకం విధి, విధానాలను మారుస్తారు. వాటిని గమనించాలి. అందుకు అనుగుణంగా అకౌంట్ నిర్వహించాలి. ఇక అమ్మాయికి 21 సంవత్సరాల వయస్సు నిండాక అకౌంట్ మెచురిటీ అవుతుంది. దీంతో మొత్తం సొమ్ము అదే అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే అకౌంట్ మెచుర్ అయ్యాక కూడా క్లోజ్ చేయకపోతే అందులో ఉన్న సొమ్ముకు వడ్డీ చెల్లిస్తారు. అలాగే అమ్మాయికి 21 సంవత్సరాల వయస్సు నిండకముందే పెళ్లి అయితే అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది.
సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఒకసారి అకౌంట్‌ను ఓపెన్ చేశాక 14 సంవత్సరాల వరకు అందులో నగదు డిపాజిట్ చేయవచ్చు. ఆ తరువాతే ఆ అకౌంట్‌లో ఉన్న సొమ్ముకు వడ్డీ చెల్లిస్తారు. అయితే మెచురిటీ పీరియడ్ 21 సంవత్సరాలు ముగియక ముందే అకౌంట్‌లోని సొమ్మును విత్‌డ్రా చేయాలంటే అందుకు అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక సొమ్ము విత్‌డ్రా కూడా అమ్మాయే చేయాల్సి ఉంటుంది. ఇతరులకు ఆ అవకాశం ఉండదు. ఈ క్రమంలోనే అమ్మాయికి అకౌంట్‌లో ఉన్న సొమ్ములో 50 శాతం వస్తుంది. అయితే దాన్ని చదువులకు లేదా పెళ్లికి మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా పైన తెలిపినట్లుగా 14 సంవత్సరాల పాటు సొమ్ము డిపాజిట్ చేసిన వారికే ఇలా విత్‌డ్రా చేసుకునే అవకాశం లభిస్తుంది.
కింది సందర్భాల్లో మాత్రమే అకౌంట్ శాశ్వతంగా క్లోజ్ అవుతుంది.
1. అకౌంట్ తెరవబడిన అమ్మాయి లేదా ఆమె తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చనిపోతే అకౌంట్ క్లోజ్ చేసి వారి నామినీలకు సొమ్ము అందజేస్తారు.
2. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అకౌంట్‌లో సొమ్ము డిపాజిట్ చేయలేరని బ్యాంకు అధికారులు భావిస్తే వారికి అలాంటి అకౌంట్లను పర్మినెంట్‌గా క్లోజ్ చేసే అధికారం ఉంటుంది.
ఈ పథకం కింద డిపాజిట్ చేసే సొమ్ముకు గాను ఇన్‌కమ్‌ట్యాక్స్ యాక్ట్ లోని 80సి ప్రకారం ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తారు. ఇక ఈ పథకంలో ఏటా డిపాజిట్ చేసే సొమ్మును బట్టి అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తరువాత డబ్బు చెల్లిస్తారు. ఈ క్రమంలో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే మెచురిటీ అయ్యాక ఎక్కువ మొత్తం సొమ్మును పొందవచ్చు.