”అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. ఆ ఏజ్‌లో నాకు పెళ్లయింది. అదీ… ఆర్మీలో పనిచేసే అధికారితో. ఆయన పేరు కెప్టెన్ షఫీక్ ఘోరి. పెళ్లయ్యాక వేరే కాపురం పెట్టాం. అయితే ఆయన ఎక్కువగా దేశ సరిహద్దుల్లో పనిచేసేవారు. ఎక్కువ రోజుల పాటు బార్డర్‌లోనే ఉండేవారు. ఇంటికి వచ్చి గడిపే సమయం చాలా తక్కువ. దీంతో ఇంటి వద్ద నేను ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు సెల్‌ఫోన్లు కూడా లేవు. ల్యాండ్ ఫోన్లే గతి. ఆయన ఫోన్ చేయాలంటే ఆర్మీ బేస్‌కు వస్తేనే వీలయ్యేది. దీంతో ఇంటి వద్దే ఒక్కదాన్నే ఉంటున్న నాకు చాలా సమస్యగా ఉండేది. అయితే నా భర్త ఘోరీ ఒకసారి సెలవుపై వచ్చి నాకు ధైర్యం చెప్పారు. ఆర్మీ అధికారులు, జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు ఎలా ఉండాలో చెప్పారు. దీంతో అప్పటి నుంచి చాలా గుండె ధైర్యంతో ఉండడం మొదలు పెట్టా.
ఈ క్రమంలోనే ఏళ్లు గడిచాయి. మా జీవితంలోకి ఇద్దరు పిల్లలు కూడా వచ్చేశారు. అది 1999వ సంవత్సరం. నా భర్త షఫీక్‌కు శ్రీనగర్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడికి ఆర్మీ వారి కుటుంబాలను అనుమతించరు. కేవలం జవాన్లు, అధికారులు మాత్రమే ఉండే అత్యంత ఉద్రిక్తమైన ప్రాంతమంది. అందుకని నేను, పిల్లలు అక్కడికి వెళ్లలేదు. ఆ సమయంలోనే నేను పిల్లలను తీసుకుని బెంగుళూరులో ఉన్న నా పుట్టింటి వారి వద్దకు వెళ్లా. అది జూన్ 28వ తేదీ, 2001వ సంవత్సరం. నాకు నా భర్త నుంచి ఫోన్ వచ్చింది. మిలటరీ ఆపరేషన్‌లో భాగంగా దట్టమైన అడవిలో ఉన్నారట. ఏం జరిగినా, ఎలాంటి వార్త వచ్చినా ధైర్యంగా ఉండాలని ఆయన నాకు ఫోన్‌లో చెప్పారు.
అప్పుడు నాకూ కొంత భయంగానే అనిపించింది. పిల్లలతో మాట్లాడాలని ఆయన ఒకసారి అడిగారు. వారు బయటికి వెళ్లారు. వచ్చాక కాల్ చేస్తానని చెప్పా. తరువాత రెండు రోజులకు అంటే.. జూలై 1న మా ఇంటికి కొందరు ఆర్మీ అధికారులు వచ్చారు. నా భర్త చనిపోయాడని చెప్పారు. దీంతో షాక్‌కు గురై కళ్లు తిరిగి పడిపోయా. తరువాత ఎలాగో లేచి తమాయించుకున్నా. నాకు తెలుసు, ఇలాంటి స్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని. నా భర్త ముందే చెప్పాడు కదా, ఏం జరిగినా ధైర్యంగా ఉండాలని, ఆయన చెప్పినట్టే ధైర్యంగా ఉన్నా. దేశ రక్షణలో ఆయన ప్రాణాలు వదిలినందుకు గర్వంగా ఉంది.
నా భర్త మృతదేహంతోపాటు ఆయన డ్రెస్, వస్తువులను అధికారులు తెచ్చి ఇచ్చారు. డ్రెస్‌లో ఓ లెటర్ కూడా ఉంది. ఆయన అడవిలోకి వెళ్లేముందు రాసిన లెటర్ అది. దాన్ని ఇప్పటికీ చదువుతా. అలా చదివే సందర్భంలో ఆయన నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆయన డ్రెస్‌ను రోజూ దగ్గర పెట్టుకుని పక్కనే కూర్చుంటా. ఆయన నా వద్దే ఉన్నట్టు ఉంటుంది. ఆ డ్రెస్‌లో ఆయన పర్సు, డబ్బు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఆయన పోయాక చాలా మంది పెళ్లి చేసుకోమన్నారు. నేను వద్దన్నాను. ఆయన జ్ఞాపకాలతో అలా బతికేస్తానని చెప్పా..!”
— యుద్ధంలో వీరమరణం పొందిన భారత ఆర్మీ అధికారి కెప్టెన్ షఫీక్ ఘోరి భార్య సల్మా ఘోరి జీవిత గాథ ఇది..! రియల్ స్టోరీ..!