ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల మనస్తత్వాలు కూడా ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన లక్షణాలను, వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. ఈ క్రమంలో ఏ వ్యక్తినైనా మన దారి లోకి తెచ్చుకోవాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పనే అవుతుంది. ఎందుకంటే ఒకరి గురించి పూర్తిగా తెలుసుకున్నా వారిని మన దారిలోకి తేవాలంటే అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వారిని మాత్రం ఇట్టే మన దారికి తెచ్చుకోవచ్చట. అందుకోసం ఆచార్య చాణక్యుడు పలు విషయాలను తెలియజేశారు. అవేమిటంటే…
కోపంగా ఉన్న వారినైతే… ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి ఎదుట చాలా మర్యాదగా, ప్రశాంతంగా ప్రవర్తించాలి. ఎల్లప్పుడూ కోపాన్ని ప్రదర్శించకూడదు. దీంతో వారు ఆటోమేటిక్‌గా కూల్ అయి కొంత శాంతి చెందుతారు. ఆ క్రమంలో మన దారికి వస్తారు. మూర్ఖులనైతే… మూర్ఖపు స్వభావం ఉన్న వారిని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలట. వారినే ఎల్లప్పుడూ ఫాలో కావాలట. దీంతో వారు ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లోకి వచ్చేస్తారట. ప్రతిభావంతులైతే… ఒక వేళ మన ఎదుట మనకన్నా ప్రతిభావంతులైన వ్యక్తులు ఉంటే వారితో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడాలట. దీంతో వారు మన పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ మన దారిలోకి వస్తారు. ఈగో ఉన్నవారు… బాగా ఈగో మనస్తత్వం ఉన్న వారిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్లప్పుడూ మర్యాదగా ఉంటూ, అదేవిధంగా ప్రవర్తించాలి. దీంతో వారు ఆటోమేటిక్‌గా మన మాట వింటారు.
స్వార్థం ఉన్న వారు, అత్యాశాపరులు… ఇలాంటి వారిని సులభంగా బుట్టలో పడేయవచ్చు. వీరికి కొంత ధనం ఆశ చూపితే చాలు, మన దారిలోకి వచ్చేస్తారు. పిల్లలు… చిన్న పిల్లలను తల్లిదండ్రులు ప్రేమ, ఆప్యాయతలతో లొంగదీసుకోవచ్చు. 5 సంవత్సరాల వయస్సు వరకు వారిని అమితమైన గారాబంగా, ప్రేమతో పెంచాలి. అదే 10 ఏళ్ల లోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్రవర్తన చేయకూడదు. ఇక 16 ఏళ్ల లోపు వారు, ఆపైన వారితోనైతే తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలగాల్సి ఉంటుంది. క్లిష్టతరమైన పరిస్థితులు వస్తే… పైన చెప్పిన మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతోనే కాదు, ఆయా సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. ప్రధానంగా చాలా క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట. అదే మంచి ఫలితాలను ఇస్తుందట.
ఒక వ్యక్తి సహజమైన స్వభావాన్ని తెలుసుకోవాలంటే… ఒక వ్యక్తికి ఉన్నటువంటి సహజసిద్ధమైన అతని స్వభావాన్ని తెలుసుకోవాలంటే అతని మాటలు, ప్రవర్తన ఆధారంగా దాన్ని నిర్ణయించవచ్చట. ఆచార్య చాణక్యుడు మానవులకు చెప్పిన కొన్ని ముఖ్యమైన, ఆచరించ తగ్గ నీతి సూత్రాలు ఇవే… ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం అత్యాశ, దురాశ, స్వార్థం వంటి అంశాలను కలిగి ఉన్న వారిని ఎన్నటికీ మార్చలేమట. ఎక్కడైతే మనకు మర్యాద, గౌరవం ఉండవో అక్కడ అస్సలు ఒక్క క్షణం కూడా ఉండకూడదట. అలాగే మనల్ని గౌరవించని వారి దగ్గర కూడా ఉండకూడదట. డబ్బులు రాని దగ్గర కూడా ఉండకూడదట. ధనవంతులు నివసించే వద్ద ఉంటే ధనం, జ్ఞానం ఉన్న వారి వద్ద ఉంటే జ్ఞానం వస్తాయట. నదులు, వైద్యులు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నివసించాలట. అవే నివాసానికి సరైన స్థానాలట.
ఎలాంటి గొడవలు లేకుండా మిక్కిలి ఆహారం, నీరు ఉన్న ప్రదేశాల్లో మాత్రమే ధనం దండిగా ఉంటుందట. సరస్సులో నీరు ఉన్నప్పుడు మాత్రమే వాటిలో ఉండి, నీరు లేనప్పుడు వాటిని విడిచి పెట్టే హంసల్లా మనుషులు జీవించాలట. ఓ వ్యక్తిని పది మంది కీర్తిస్తే మనం కూడా కీర్తించాలట. కానీ సొంతంగా ఎవరికి వారే కీర్తించుకోకూడదట. మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిస్తేనే అసలైన ఆనందం కలుగుతుందట. మనుషులు తోటి మనుషులకు సహాయం చేయకుండా ఉంటే అప్పుడు వారు బతికి ఉన్నా చచ్చినవారితో సమానమేనట. విజయాన్ని ఎల్లప్పుడూ వెంట బెట్టుకునే తిరిగే వారిని ఆదర్శంగా తీసుకున్నా, అలాంటి వారి కథలను చదివినా దాంతో మనమూ స్ఫూర్తి పొంది విజయం సాధించవచ్చట. జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని కాదనకూడదట. ఎప్పుడు, ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా.