ఎన్ని పనులున్నా, ఏమున్నా, ఎక్కడైనా, ఎప్పుడైనా… నిత్యం మనం కచ్చితంగా స్నానం చేయాల్సిందే. దీని వల్ల శరీరం శుభ్రంగా ఉండడమే కాదు, అనేక రకాల అనారోగ్యాలు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. శారీరక ఆరోగ్యంతోపాటు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అయితే రోజూ మనం చేసే స్నానం మాత్రమే కాకుండా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కూడా స్నానం చేయాల్సి ఉంటుంది. ఇది మేం చెబుతోంది కాదు, ఆచార్య చాణక్యుడు చెబుతోంది. అలాంటి సందర్భాల్లో కచ్చితంగా స్నానం ఆచరించాల్సిందేనని ఆయన వివరిస్తున్నారు. మరి ఆ సందర్భాలేమిటో ఇప్పుడు చూద్దామా..?
ఎవరైనా వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి మృతదేహాన్ని వారి మత విశ్వాసాల ప్రకారం శ్మశానంలో ఖననం లేదా దహనం చేస్తారు కదా. అయితే అక్కడికి మనం వెళ్లామనుకోండి. అనంతరం అక్కడి నుంచి తిరిగి వచ్చాక స్నానం చేయాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మనకు ఎంత దగ్గరైనా, ఎవరైనా అది ఒక మృతదేహం కదా. అనేక క్రిములు వస్తుంటాయి. అవి శరీరం మీదకు కూడా చేరుతాయి. కనుక కచ్చితంగా స్నానం చేయాల్సిందే. దంపతులు శృంగారంలో పాల్గొన్నాక కచ్చితంగా స్నానం చేయాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే అది ఒక పవిత్ర దైవ కార్యం కనుక, అలాంటి కార్యం చేసినప్పుడు స్నానం చేయాలట. అలాగే స్నానం చేయకుండా ఇంటి నుంచి అస్సలు బయటకు వెళ్లకూడదట.
ప్రతి వ్యక్తి కచ్చితంగా వారానికి ఒకసారి శరీరమంతా నూనె పట్టించుకుని మర్దనా చేసుకుని అనంతరం కచ్చితంగా స్నానం చేయాలట. మర్దనా అనంతరం అస్సలు గ్యాప్ ఇవ్వకుండా వెంటనే స్నానం చేయాలట. ఎందుకంటే నూనెతో మసాజ్ చేస్తే చర్మం రంధ్రాలు తెరుచుకుని అందులో నుంచి వ్యర్థాలు బయటికి వస్తాయి. కనుక ఎక్కువ ఆలస్యం చేయకుండా మసాజ్ వెంటనే స్నానం చేసేయాలి. హెయిర్ కట్ చేయించుకున్న వారు వెంటనే స్నానం చేయాలి. లేదంటే చిన్నపాటి వెంట్రుకలు మన శరీరంపై ఎక్కువ సేపు ఉంటే దాంతో అనారోగ్యాలు కలుగుతాయట. కనుక కటింగ్ చేయించుకున్న వెంటనే స్నానం చేయడం మంచిది.