lifestyle

విజ‌య‌వాడ‌లో పుణుకులు, బ‌జ్జీలు ఏ హోట‌ల్‌లో బాగుంటాయి..?

అసలైన తెలుగోడికి సిసలైన సాయంకాలం అల్పాహారం పుణుకులు, బజ్జీలే! ప్రశ్నలో చెప్పినట్టు విజయవాడలో బాగుంటాయి, నిండుగా దొరుకుతాయి. వీటికోసం హైదరాబాద్ లేదా విదేశాల నుంచి వచ్చిన జనాల ఆత్రం చూడాలి…! పుణుకులు, బజ్జీలకు ఆ రేంజ్ ఉన్నా, హోటల్ రేంజ్ కి వెళ్ల‌లేదు – బండ్ల మీదే వాటి సవారి. నా దృష్టిలో విజయవాడలో బాగుండే బండిలు, స్టాల్స్ కిందవి; అలా ఉంటుంది, ఇలా ఉంటుంది వర్ణన లేదు, డైరెక్ట్ యాక్షన్ యే. ఏలూరు రోడ్డు విజయ టాకీస్ దగ్గర రాజు ఘీ స్వీట్స్ అని ఉంటుంది. దానికి ఆనుకొని ఉన్న సందులో కొంచెం లోపలికి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. ఇది బండి కాదు. ఒక టిఫిన్ హోటల్ లానే ఉంటుంది. ఒక బిల్డింగ్ లో కింద ఫ్లోర్ ఉంటుంది. నిజానికి కొన్ని సంవత్సరాల కిందట అక్కడే బండి మీద పుణుకులు వేసుకునే వారు. జనాలతో ఆ బండి కిటకిటలాడి, తద్వారా గల్లా పెట్టె గలగలలాడి భవనం కట్టుకున్నారు.

సత్యనారాయణ పురం శివాజీ కేఫ్ సెంటర్ లో రాజన్ కిళ్లీ కొట్టు ఉంటుంది. దాని పక్క సందులో పండు టిఫిన్ సెంటర్ యే మనకి కావల్సింది. ఈ మధ్య తెరవట్లేదు అని విన్నాను. ఈ కోవిడ్ వల్ల అయ్యుంటుంది అనుకున్నాను. డోర్నకల్ రోడ్డు ఏలూరు రోడ్డును, బందర్ రోడ్డును కలుపుతుంది. ఆ రోడ్డు చివరిలో (ఏలూరు రోడ్డు వైపు) ఒక చిన్న కొట్టు. ఏలూరు రోడ్డు నుంచి డోర్నకల్ రోడ్డు లోకి తిరిగితే మనకి యెడమ చేతి పక్క పది అడుగులు వేయగానే ఉంటుంది. పుష్ప హోటల్ నుంచి ఏలూరు రోడ్డుకు బయలదేరి నాలుగు అడుగులు వేయగానే కుడి చేతి వైపు చిన్న కొట్టు ఉంటుంది. గుర్తుగా: దాని పక్కనే మెడికల్ కొట్టు ఉంటుంది. వాడుకలో పుష్ప హోటల్ ఎదురుకుండా అనేస్తారు – అంత దగ్గర.

what are the best places to have punukulu in vijayawada

గాంధీ నగర్ శైలజ థియేటర్ ఎదురుకుండా రవి పుణుకుల సెంటర్. మొఘల్ రాజ పురం సిద్ధార్థ కళాశాల నుంచి అమ్మ కళ్యాణ మండపం వైపు వెళ్తుంటే, కుడి చేతి వైపు మోడరన్ ఫుడ్స్ (సూపర్ బజార్) వస్తుంది. అది దాటగానే కుడి చేతి వైపు సందులోకి తిరిగి, లోపలికి వెళితే, యెడమ చేతి వైపు ఒక బండి ఉంటుంది. గుర్తు కోసం: చిన్న గుడి ఉంటుంది, దాని కన్నా ముందే. ఇంకో గుర్తు: బ్యాడ్మింటన్ హౌజ్ (ఇల్లు పేరు) బిల్డింగ్. నేను అలా బండ్ల మీద తినను, నా శుభ్రం వేరు అంటారా, విజయవాడ క్లబ్ లో పుణుకులు, బజ్జీలు కూడా బాగుంటాయి. కాని అది ఊరు అవతల, సభ్యత్వం ఉన్న వాళ్ళు ఉండాలి. ఒకప్పుడు ఏలూరు రోడ్డు రామ మందిరం పక్క సందులో ఒక ముసలాయన బండి పెట్టుకొని, కేవలం బజ్జీలు, బెల్లం జిలేబి, వడ వేసేవాడు. చాలా బాగుండేవి. ఐదారు సంవత్సరాల నుంచి పెట్టట్లేదు. ఇలా మనకు తినే అవకాశాలు చేయి జారిపోతాయి. అందుకని త్వరగా రుచి చూసేయండి!

Admin

Recent Posts