lifestyle

దుబాయ్‌లో పర్యాటకులకు ఎంత ఖరీదులో వసతి లభిస్తుంది?

దుబాయ్ మొదటిసారి వచ్చిన వారు ముందుగా ప్రతీ విషయం గురించి సరైన ప్రణాళిక వేసుకోవాలి. ఇక్కడకు అనే కాదు అది ఎక్కడకు వెళ్ళాలి అన్నా అవసరమే కదా. టూరిస్ట్ వాళ్ళను సంప్రదించేవారు, పూర్తిగా వారి మీదే ఆధారపడతారు. వాళ్లకు కొన్ని హోటల్స్ తో టై-అప్ ఉంటుంది. వాటినే రిఫర్ చేయటానికి చూస్తారు. ఆయా హోటల్స్ లో రూమ్ ఖరీదు నిజానికి తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వసూలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫ్యామిలీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని మార్గాలు ఉన్నాయో ముందు చూద్దాం. ఆ తర్వాత బ్యాచిలర్స్ విషయం చూద్దాం. కేవలం వీసా తీసుకుని, ఇక్కడ దిగాక, ఇక్కడి గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ లోనే ఒక సిమ్ ఇస్తుంది. నెల లేదా 3 నెలల వీసాని బట్టి వీసా గడువు పూర్తయ్యేదాక ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తుంది. కాబట్టి బ్రౌజ్ చేసుకుని ఎక్కడెక్కడ హోటల్స్ ఉన్నాయి, ఎంతమందికి ఎంత అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ముందుగా ప్లాన్ చేసుకోకుండా వచ్చిన వారికి ఉపయోగపడుతుంది.

ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న హోటల్స్ ని తీసుకోకపోవడం మంచిది. ఎక్కడ నుండి అయితే అనేక ప్రదేశాలు చేరుకోవటానికి ఈజీ ట్రాస్పోర్ట్ దొరుకుతుందో ఆ ఏరియాల్లో హోటెల్ రూమ్ తీసుకోవటం మంచిది. నిజానికి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంది గానీ అక్కడ నుండి యూనియన్ మెట్రో స్టేషన్ కి వచ్చి రైలు మారాల్సి వస్తుంది. పైగా ఎయిర్పోర్ట్ ఉన్న రోడ్ లో టాక్సీ కి అదనంగా 20 దిర్హంస్ ప్రతీసారి చెల్లిస్తూ ఉండాలి. హోటల్ రేట్లు కూడా ఎక్కువే. ఎయిర్పోర్టు నుండి ట్యాక్సీ తీసుకుని డేరా అని ఏరియాకి వస్తే తక్కువ రేట్లలో ఉన్న హోటల్స్ దొరుకుతాయి. అయితే అది ఓల్డ్ సిటీ. చూడటానికి మన దేశంలో బిజీగా ఉండే ఏరియాల్లానే ఉంటుంది. దుబాయ్ లో ఉన్నాం అనే భావన రాదు. ఇండియన్స్, పాకిస్తానీయులు, ఫిలిప్పైన్స్ ఎక్కువ కనబడతారు.

what is the cost of hotel in dubai for one day

హోటల్లో సింగిల్ రూమ్ 80 దిర్హంస్ నుండి దొరుకుతాయి. డీలక్స్ రూమ్స్ 250 దాకా ఉంటాయి. క్వాలిటీ గొప్పగా ఊహించుకోక పోవటం మంచిది. ఎంత చెట్టుకు అంతే గాలి అనేది అన్ని చోట్లా వర్తిస్తుంది. అలా అని భరించలేం అనే స్థాయిలో ఏమాత్రం ఉండదు ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ప్రతీ రెస్టారెంట్, ప్రతీ హోటల్ ని వారానికి ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఒక మంచి హోటల్ 300 నుండి మొదలుకుని, లిమిట్ లేనంత వరకు వెళుతుంది. అయితే ప్రతీ హోటల్ బ్రేక్ఫాస్ట్ బాధ్యత తీసుకుంటుంది. ఇది ఇండియాలో కూడా ఉన్నదే. కొన్ని హోటల్స్ లో పాటల కచేరి ఉంటే, కొన్నిట్లో లైవ్ డ్యాన్స్ ప్రోగ్రాములు ఉంటే, ఇంకొన్నిటిలో పబ్-లు ఉంటాయి. కటిక చీకట్లో తాగేసి ఎవరికి నచ్చినట్టు వారు ఊగుతూ ఉంటారు. నేనూ ఓ సారి వెళ్ళాను కాబట్టి తెలిసింది. చిన్నప్పుడు చందమామలో చదివిన దెయ్యాల్లా అనిపిస్తారు గానీ ఝడుసుకోవాల్సిన పని లేదు. మనుషులేనట.

ఈ ఏరియా మెట్రోకి జంక్షన్. ఇక్కడ నుండి చాలా ఏరియాలకు మెట్రో రైలు ఉంది. NOL కార్డ్ తీసుకుంటే ఒక ఏరియా నుండి ఇంకో ఏరియాకి (ఒక్కొక్కరికి) 3 దిర్హంస్ లో వెళ్ళవచ్చు. పైగా ఈ ఏరియాలో దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు, అన్ని దేశాల వస్తువులు అతి తక్కువ ధరకు దొరుకుతాయి. మంచి బిజీ ఏరియా. ఇక్కడున్న ఏ ఎన్నారీ కూడా ఇండియా వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో షాపింగ్ చేయకుండా వెళ్ళరు అంటే అతిశయోక్తి కాదు. అయితే.. నెలరోజుల ప్రోగ్రాం పెట్టుకుని ఒక ఫ్యామిలీ వచ్చారు అనుకోండి. 30×300=9000 దిర్హంస్ కేవలం దీనికే పోతాయి. ఇవి గాక బయట ఫుడ్ కి రోజుకి తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా తల ఒక్కింటికి 40 దిర్హంస్ అవుతాయి. కాబట్టి రెండో ఆప్షన్ చూద్దాం. హోటల్ అపార్ట్మెంట్స్.. ఇవి మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే ఫర్నీచర్ ఉంటుంది. బెడ్ సోఫా వగైరా. వీటితో పాటు కిచెన్ కూడా. వంట చేసుకోవటానికి సౌలభ్యం ఉంటుంది. ప్రతీరోజు బయట తిండి అంటే పడని వారికి, ఆరోగ్యం పట్ల శ్రద్ద ఉన్నవారికి, కొంచెం ఖర్చు తగ్గించుకోవాలి అనుకున్న వారికి ఇది బాగుంటుంది. ఇది తీసుకుంటే కేవలం ఫుడ్ ఖర్చు మాత్రమే తగ్గుతుంది. శాకాహారం తీసుకునే వారికి ఇది రైట్ ఛాయిస్ కూడా.

మూడో ఆప్షన్: ఓల్డ్ సిటీ కమర్షియల్ ఏరియా. అక్కడ తప్ప మిగిలిన చోట్ల నెల కోసం 1BHK, 2BHK, విల్లాలు దొరుకుతాయి. ఫర్నీచర్ తో సహా. 1BHK రెంట్ నెలకు 2000 నుండి 3300 దాకా ఉంటుంది. ఫ్యామిలీకి మంచి ఆప్షన్. ఇక బ్యాచిలర్స్ విషయానికి వద్దాం. పైన ఆప్షన్స్ బ్యాచిలర్స్ కి అనవసర ఖర్చులానే ఉంటుంది. పైన చెప్పిన డేరా అనే ఏరియా తో సహా చాలా ఏరియాల్లో బెడ్ స్పెసెస్ దొరుకుతాయి. నెలకు 350 నుండి 700 దాకా వసూలు చేస్తారు. ఒక రూములో నాలుగు బెడ్స్ కలిగి ఉన్న బంక్ బెడ్స్ ఇవి. ఎక్కువ శాతం ఇండియన్స్, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయులు ఇలాంటి వాటిల్లోనే ఉంటారు.

Admin

Recent Posts