జ్యోతిష్యం మూఢనమ్మకం..అవును కొన్ని సందర్బాలలో అలాగే అనిపిస్తుంది..ఈ కింది మెసేజ్ చూస్తే నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్లు కూడా నవ్వుకోకమానరు. నమ్ముతున్నారు కదా అని ప్రతిది చెప్తే ఆఖరుకి అపహాస్యం పాలవక తప్పదు. కరెక్ట్ గా ఈ మెసేజ్ విషయంలో అదే జరిగింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే మన రాశుల ప్రకారం మనం ఏ ఫోన్ వాడితే మంచిది అని వాట్సప్ లో హల్ చల్ చేస్తున్న మెసేజ్.. ఆ మెసేజ్ ఏంటో మీరు చదవండి.. ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నిపుణులు అన్ని విషయాల్లోనూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇక మొబైల్ విషయానికి వస్తే.. ఏ వ్యక్తి అయినా తన రాశి ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ను వాడితే దాంతో చాలా మంచి జరుగుతుందట. లక్ కలసి వస్తుందట. మరి 12 రాశులను బట్టి ఏయే రాశి వారు ఏయే స్మార్ట్‌ఫోన్లను వాడవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. మేష రాశి.. ఈ రాశి వారికి ఓపిక, సహనం తక్కువగా ఉంటుంది. అందుకే ఏ పని అయినా చాలా వేగంగా జరగాలని కోరుకుంటారు. కనుక వీరు 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్లను వాడితే మంచిది. 2. వృషభం.. వీరు ప్రకృతిని, అందాలను ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు ఏ పనికోసమైనా చక్కగా ప్రణాళికలు వేస్తారు. ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఆశయం వీరిలో బలంగా ఉంటుంది. కనుక వీరు శాంసంగ్ కు చెందిన మిడ్ రేంజ్ లేదా ఫ్లాగ్ షిప్ ఫోన్లను కొనాలట. 3. మిథునం.. వీరు తమలో ఉన్న ఎలాంటి భావాలనైనా చాలా సృజనాత్మకంగా ఇతరులతో చెప్పగలరు. వీరికి గుంపులో ఒకరిగా కన్నా సింగిల్‌గా ఉండడమే ఇష్టం. కనుక వీరు ఏ కంపెనీకి చెందిన ఫోన్లు అయినా సరే ఫ్లాగ్ షిప్ ఫోన్లను వాడితే మంచిదట.
4. కర్కాటకం.. వీరు ఎక్కడికెళ్లినా, ఏ పని చేసినా అందులో కంఫర్ట్ కోరుకుంటారు. అంతేకానీ అనవసరంగా ఆందోళనలకు గురికారు, కన్‌ఫ్యూజ్ అవరు. నిర్దిష్టమైన ప్రణాళికతో ఉంటారు. కనుక వీరు గూగుల్ కు చెందిన పిక్సల్ ఫోన్లను కొనుక్కుంటే బాగుంటుంది. 5. సింహం.. వీరికి కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా అప్‌డేటెడ్‌గా ఉండాలని వీరు ఆలోచిస్తారు. విలాసవంతంగా ఉండాలని కోరుకుంటారు. కనుక వీరు ఐఫోన్లను వాడితే మంచిదట. 6. కన్య.. ఎక్కడికెళ్లినా, ఎందరిలో ఉన్నా వీరు సింపుల్‌గా ఉండాలని కోరుకుంటారు. అనవసరమైన ఖర్చులకు పోరు. సాధారణ వ్యక్తిలా జీవించాలని అనుకుంటారు. కనుక వీరు మిడ్ రేంజ్ లేదా తక్కువ బడ్జెట్ ఫోన్లను వాడితే మంచిది.
7. తుల.. వీరికి సంగీతం వినడం, పుస్తకాలు చదవడం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక వీరు ఆ స్థాయికి సరిపోయే భారీ స్టోరేజ్ ఉండే ఫోన్లను కొంటే మంచిదట. 8. వృశ్చికం.. వీరికి నలుగురిలో ప్రత్యేకంగా ఉండడం అంటే ఇష్టం. అందుకోసమే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అందరిలా ఉండాలని కోరుకోరు. కనుక వీరికి భిన్నమైన ఫోన్ అయిన నోకియా ఫోన్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. 9. ధనుస్సు.. వీరు ఎల్లప్పుడూ సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటారు. నలుగురిలోనూ స్పెషల్‌గా ఉండాలని భావిస్తారు. ఇలాంటి వారు ఐఫోన్ కొంటే బెటర్. 10. మకరం.. వీరు ఏ విషయంలో అయినా కచ్చితత్వం కోరుకుంటారు. 100 శాతం పని పూర్తి చేయాలని ఉంటుంది. నాణ్యతకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. కనుక వీరు ఐఫోన్లను కొంటే మంచిదట.
11. కుంభం.. వీరికి ఎల్లప్పుడూ వినోదం కావాలి. దాన్నే ఎక్కువగా కోరుకుంటారు. ఎక్కువ ఉల్లాసాన్ని ఆశిస్తారు. ఊహాశక్తి అధికంగా ఉంటుంది. కనుక వీరు మంచి కెమెరాతోపాటు ఫోన్ స్టోరేజ్ అధికంగా ఉన్నవి తీసుకుంటే మంచిది. 12. మీనం.. వీరికి కొత్త అంశాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా ముందుండాలని భావిస్తారు. నలుగురిలోనూ టాప్ ప్లేస్‌లో ఉండాలని కోరుకుంటారు. కనుక వీరు కూడా ఐఫోన్లను కొంటే మంచిదట.