సైన్స్ అభివృద్ధి వల్ల మనిషికి ప్రతి పని చాలా సులువు అయింది. సాంకేతిక రోజు రోజుకి పెరుగుతూ పోతుండడంతో మనుషులకి శ్రమ తగ్గుతుంది. అయితే ఒకప్పుడు ఎత్తైన అపార్ట్మెంట్ ఎక్కాలి అంటే చెమటోడ్చి ఎక్కాల్సి ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు లిఫ్ట్స్ వచ్చేశాయి. చిన్న చిన్న బిల్డింగ్స్‌తో పాటు పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో కూడా లిఫ్ట్స్ తప్పక ఉంటున్నాయి. అయితే లిఫ్ట్ ఎక్కగానే అందులో మనకు అద్దం దర్శనం ఇస్తుంది. ఆ అద్దం ఎందుకు ఏర్పాటు చేస్తారో చాలా మందికి తెలియదు. అందరికి తెలిసింది.. కేవలం మనం మన ప్రతిబింబం చూసుకునేందుకు అని అనుకుంటారు. కాని అందులో ఓ సైన్స్, ఓ లాజిక్ దాగి వుంది. సాధారణంగా లిఫ్టుల్లో వెళ్లేటప్పుడు ఏదో తెలియని భయం ఉంటుంది.
తెలియని వ్యక్తులు అందరు ఒక చోట చేరడంతో కొంత ఆందోళన కలగడం సర్వసాధారణం. అయితే ఆ సమయంలో లిఫ్టులో ఉన్న అద్దం మన దృష్టిని మరలకుండా చేస్తుంది. మన ఏకాగ్రత అంతా అద్దంపై ఉంటుంది. దీంతో ఆందోళన, భయం వంటివి దూరమవుతాయి. మరో వైపు లిఫ్ట్ వేగంగా వెళ్లడం వలన చాలా మంది భయడుతుంటారు. అయితే లిఫ్టులో ఉండే అద్దం కారణంగా భయం దూరమవుతుంది. ఇక లిఫ్టులో గాలి తక్కువగా ఉండడం, ఫ్రెష్ ఎయిర్ లేకపోవడం కారణంగా ఆందోళన పెరుగుతుంది, గుండె వేగం పెరుగుతుంది. అరచేతిలో చెమటలు పడుతుంటాయి. లిఫ్ట్ లో అద్దం ఉండడం, దాని చూడటం వల్ల ఇలాంటి ఆందోళనలు దూరమవుతాయి. ఎలివేటర్లలో అద్దాలు ముఖం చూడడానికి పెట్టారేమో అని అపోహ కలిగి ఉంటారు. అయితే, అద్దం అమర్చిన తర్వాత అందరి దృష్టి అద్దం వైపు మళ్లడం ప్రారంభమైంది. అందుకే ఎలివేటర్లలో అద్దాలను ఉపయోగిస్తారు.
లిఫ్టుల్లో అద్దాలను మొదట జపాన్‌లో ప్రవేశపెట్టారు. వికలాంగులు, వీల్ ఛైర్ వాడేవారు మెట్లు ఎక్కాలంటే చాలా ఇబ్బంది. అలాంటి వారి కోసం ఇవి ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. లిఫ్ట్ ఎక్కి అందులో తమ కుర్చీని వెనక్కి తిప్పడం వారికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు అద్దం సాయంతో వారు ఎక్కడ ఖాళీ ఉందో చూసుకుని వీల్ ఛైర్ సర్దుబాటు చేసుకుంటారు. ఇలాంటి పలు ప్రయోజనాల కోసమే ఎలివేటర్లలో అద్దాలు పెడతారు. లిఫ్ట్ లో బోర్ గా నిలుచునే బదులు అద్దంలో తమని తాము చూసుకుంటూ, ఇతరులను కూడా గమనించవచ్చు. అదే అద్దం లేకపోతే నేల చూపులు చూస్తూ ఉండడం వలన అక్కడ ఉండే నిమిషం, రెండు నిమిషాలు కూడా ఎంతో సమయం ఉన్నట్టు అనే భావన కలుగుతుంది. లిఫ్ట్‌లో అద్దం ఉండడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.