ఈ రోజుల్లో ఎక్కువ మంది లాంగ్ జర్నీ కోసం రైల్వేని బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. జర్నీకి కొన్ని రోజుల ముందు రిజర్వేషన్ చేసుకొని కన్‌ఫాం అయ్యాక తమ ప్రయాణం సాగిస్తూ వస్తున్నారు. అయితే రైల్వేలో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతీయ రైల్వే శాఖ తాజాగా అడ్వాన్స్ బుకింగ్ కోసం కొత్త నియాలను ప్రకటించింది. ఈ కొత్త నియమాల ప్రకారం ట్రైన్ టికెట్ లను ఎప్పుడంటే అప్పుడు బైక్ చేయడం కుదరదు. ఇప్పుడు ఉన్న బుక్ కాలాన్ని కుదిస్తూ కొత్త రూల్స్ ను తీసుకు వచ్చింది. అంతేకాదు, ఈ కొత్త రూల్స్ నవంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కూడా తెలిపింది. తత్కాల్‌లో చివరి నిమిషంలో టిక్కెట్ కొనుగోళ్లకు అనుమతి ఉండేది. కానీ ఇప్పుడు ప్రయాణీకులు ఈ టిక్కెట్లను ప్రయాణానికి ఒకరోజు ముందు బుక్ చేసుకోవాలి. ఏసీ తరగతులకు ఉదయం 10 గంటలకు మరియు నాన్-ఏసీతరగతులకు 11 గంటలకు బుకింగ్ విండో తెరవబడుతుంది.
ప్రస్తుతం రైల్వే ప్రయాణికులు ప్రయాణానికి 120 రోజుల ముందు బుకింగ్ చేసుకొనే సదుపాయం ఉండగా, దాన్ని 60 రోజులకు కుదిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు 2024 నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని రైల్వే అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 31 వరకు బుకింగ్ చేసుకునేవారికి కూడా పాత నిబంధనే వర్తిస్తుంది. నవంబర్ 1 నుంచి ట్రైన్ టికెట్ లను ముందుగా బుక్ చేసే ప్రయాణికులు కేవలం 2 నెలల ముందు మాత్రమే బుక్ చేసుకునే అవకాశం వుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో నాలుగు నెలల ముందస్తు బుకింగ్ అవకాశం ఇప్పుడు రెండు నెలలకు మాత్రమే వర్తిస్తుంది.
తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్ల టికెట్ బుకింగ్‌ల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు స్పష్టంచేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆ రైళ్లలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉందని వివరించారు. విదేశీయులు కూడా ఎప్పటిలాగే 365 రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మార్పు చేయటం లేదని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను మరింత వాడుకోవడానికి భారతీయ రైల్వే శాఖ సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం ఫుడ్ క్వాలిటీ, లెనిన్ క్లాత్‌ల పర్యవేక్షణకు ఏఐ కెమెరాలు వాడుతుండగా, రైళ్లలో ఆక్యుపెన్సీ కోసం కూడా ఏఐ కెమెరాలను వాడనుంది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా బెడ్ షీట్ల శుభ్రత కోసం ఏఐ కెమెరాలు వినియోగించగా, 100 శాతం ఫలితం వచ్చింది. అందుకే ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.