Ankle Pain : మడమ నొప్పి.. ఈ సమస్యతో కూడా మనలో చాలా మంది బాధపడుతుంటారు. మడమ వెనుక భాగంలో, కింది భాగంలో నొప్పి వచ్చి నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మడమ నొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ప్రతి మనిషిలో పాదం అడుగున ప్లాంటార్ ఫెషియా అనే కండరం ఉంటుంది. కాలి మధ్యలో ఉండే గొయ్యి లాంటి నిర్మాణానికి కూడా ఈ కండరమే ఆధారం. నడక, జాగింగ్, పరిగెత్తడం, బరువులు ఎత్తడం వంటి పనులు చేయాలంటే ఈ కండరం సహాకారం అవసరం. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ కండరం చీలడం లేదా నలగడం జరుగుతుంది.
బరువు ఎత్తుతున్నప్పుడు పాదాన్ని నేల మీద తొక్కి పెట్టి ఉంచుతాం. ఆ సమయంలో అంతే బలం వ్యతిరేక దిశలో శరీర కండరాలను లోపలికి లాగుతుంది. అంటే పాదం బయటకు, లోపలికి ఒకేసారి ఒత్తిడి కలుగుతుంది. మడమ నొప్పికి ఈ ఒత్తిడే ప్రధాన కారణం. అయితే పాదంలో ఎముకల మధ్య పగుళ్ల వల్ల కూడా అరుదుగా నొప్పి కలగవచ్చు. వయసు పెరగడం, అధిక బరువు వల్ల కూడా మడమ కాలి నొప్పి రావచ్చు. శరీరంలో 26 పెద్ద ఎముకలు ఉంటే వాటిలో ప్రధానమైనది కాలి మడమ ఎముక. దీనికి ప్రధానంగా వంద కండరాలు, 33 చిన్నా పెద్దా ఎముకలు కలిసి మనల్ని నడిపిస్తూ ఉంటాయి.
వీటన్నింటిని అనుసంధానం చేసేది మడమ కండరమే. ఒక్కోసారి మడమ భాగంలో చిన్న ఎముక లాంటిది పెరిగి అది మడమ ఎముకకు, కండరానికి మధ్య దూరం పెంచుతుంది. దీని వల్ల కూడా మడమ నొప్పి రావచ్చు. అయితే చాలా అరుదుగా కొంత మందిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఎక్కువ వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం, అధిక బరువులు ఎత్తడం వంటివి చేయడం వల్ల మడమ నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన వారు నడవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మడమ కాలి నొప్పికి గుర్తించలేని లక్షణాలు అంటూ ఏవి లేవు. పాదాల మీద ఒత్తిడి పడితే మడుమ నొప్పి విపరీతంగా బాధిస్తుంది. మెట్టు ఎక్కి దిగేటప్పుడు నొప్పి బాగా తెలుస్తుంది.
ముఖ్యంగా మడమ వెనుక భాగంలో నొప్పి అధికంగా ఉంటుంది. కొందరిలో అరికాళ్ల మంటలు, తిమిర్లు రావడం, స్పర్శ తెలియక పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్య బారిన పడిన వారు ఎక్కువగా బరువులు ఎత్తకూడదు. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, వేడి నీటిలో పాదాలను ఉంచడం , పాదాలకు మర్దనా చేయడం వంటివి చేయడం వల్ల కొంతమేర నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మనం ధరించే చెప్పులు మెత్తగా, మృదువుగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించిన తరువాత కూడా నొప్పి తగ్గకపోతే వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది.