Eyes Checking : మనం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు వారు మనకు అన్ని రకాల పరీక్షలు చేస్తారు. మనం చెప్పిన సమస్యను బట్టి పలు రకాల వైద్య పరీక్షలు చేసి అప్పుడు మనకు ఉన్న వ్యాధి గురించి నిర్దారిస్తారు. దానికి తగినట్లు మనకు చికిత్సను అందిస్తారు. మందులను లేదా ఇంజెక్షన్లు ఇవ్వడమో.. తీవ్రత ఎక్కువైతే శస్త్ర చికిత్స చేయడమో చేస్తారు. అయితే సాధారణంగా ఏ డాక్టర్ అయినా సరే మనల్ని పరీక్షించేటప్పుడు ముందుగా మన కళ్లను చూస్తాడు. ఇలా ఎందుకు పరిశీలిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం డాక్టర్ వద్దకు వెళ్తే పరీక్ష చేసేటప్పుడు మన కళ్లలో లైట్ వేసి చూస్తారు. దీంతో వారికి పలు విషయాలు తెలుస్తాయి. రక్తహీనత సమస్య ఉంటే కళ్ల లోపల కింది భాగంలో తెల్లగా పాలిపోయినట్లు ఉంటుంది. ఈ విషయాన్ని కళ్లను పరిశీలించడం ద్వారా తెలుసుకుంటారు. అలాగే కళ్లలో పసుపుదనం ఉందో లేదో గమనిస్తారు. ఉంటే జాండిస్ వచ్చిందని చెబుతారు.
ఇక విటమిన్ ఎ లోపం ఉంటే కళ్లలో తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. ఇవి కళ్లలో తెల్లని సుద్ద మాదిరిగా ఉంటాయి. ఇవి ఉంటే విటమిన్ ఎ లోపం ఉందని అర్థం. ఇవి కూడా ఉన్నాయో లేవో అని పరిశీలిస్తారు. అలాగే కళ్లలో శుక్లాలు ఏర్పడితే కనుగుడ్డు పైభాగంలో తెల్లని పొరలా ఉంటాయి. వీటిని కూడా పరీక్షిస్తారు.
కళ్లలో లైట్ వేయడం వల్ల కనుపాపల సైజ్, ఆకారం, రంగు వంటి వాటిల్లో వచ్చే మార్పులను గమనిస్తారు. అలాగే కళ్లలో కొలెస్ట్రాల్ నిల్వలు ఉన్నా కూడా తెలిసిపోతాయి. అందుకనే డాక్టర్లు మనల్ని పరీక్షించేటప్పుడు లైట్ వేసి కళ్లను చెక్ చేస్తారు. మనకు ఉండే అనారోగ్య సమస్యలకు చెందిన లక్షణాలు కొన్నిసార్లు కళ్లలో కనిపిస్తాయి. కనుకనే వారు కళ్లను పరీక్షించి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకుంటారు. దీంతో చికిత్స అందించడం సులభతరం అవుతుంది. అందుకనే వైద్యులు తప్పనిసరిగా కళ్లను లైట్ వేసి మరీ చెక్ చేస్తారు.