Fever : మన శరీరంలో మెదడు ఎంత ముఖ్యమైన అవయవమో అందరికీ తెలిసిందే. ఇది అనేక విధులను నిర్వర్తిస్తుంది. అయితే మెదడులో హైపోథాలమస్ అనే చిన్న భాగం ఉంటుంది. ఇది మెదడు బరువులో కేవలం 0.3 శాతం బరువు మాత్రమే కలిగి ఉంటుంది. కానీ చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. మన శరీరంలోకి ఏవైనా బాక్టీరియా, వైరస్‌లు ప్రవేశించినప్పుడు హైపోథాలమస్ వెంటనే స్పందిస్తుంది. మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తమైన మన శరీరంలో చేరిన బాక్టీరియా, వైరస్‌లను నిర్మూలించేందుకు పనిచేస్తుంది. ఇలా హైపోథాలమస్ పనిచేస్తుంది.
అయితే జ్వరం అనేది మన శరీరం సహజంగా చేసే ఓ ప్రక్రియ. దానికి ఎలాంటి ఆటంకం కలిగించరాదు. శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లు నాశనం అవగానే మన శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది. అంత వరకు వేచి చూడాలి. కానీ కొందరు జ్వరం వచ్చిందనగానే ఖంగారు పడి మెడిసిన్లను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం తనకు ఉండే సహజసిద్ధమైన రోగాలను తగ్గించే లక్షణాన్ని కోల్పోతుంది. కనుక జ్వరం వస్తే అది తగ్గే వరకు వేచి చూడాలి. అంతేకానీ వెంటనే మెడిసిన్‌లను వాడరాదు.
సాధారణంగా మనకు జ్వరం వస్తే 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ సమయం ముగిశాక కూడా జ్వరం అలాగే ఉంటే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. దీంతో జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. అయితే జ్వరం వచ్చినవారు పలు రకాల పండ్లను తినడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. అవేమిటంటే..
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తినడం వల్ల జ్వరం వచ్చినవారు త్వరగా కోలుకుంటారు. యాప్రికాట్, ఆల్‌బుకర్, నిమ్మ, నారింజ, కివీ, పైనాపిల్, జామ వంటి పండ్లను తింటే జ్వరం త్వరగా తగ్గుతుంది. అలాగే బొప్పాయి, యాపిల్, పుచ్చకాయ, దానిమ్మ వంటి పండ్లను కూడా తినవచ్చు. ఇవి కూడా జ్వరాన్నిత్వరగా తగ్గిస్తాయి. పోషకాలను అందిస్తాయి. కనుక జ్వరం వచ్చినవారు ఈ పండ్లను తింటే ఎంతగానో మేలు జరుగుతుంది.