Lemon Tea : ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఇలా తాగనిదే వారికి రోజు ప్రారంభం కాదు. ఇక ఉదయం బెడ్ టీ లేదా కాఫీ తాగకపోతే కొందరికి అసలు ఏమీ చేయాలనిపించదు. అంతలా అవి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. అయితే టీ విషయానికి వస్తే ఇందులోనూ అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. వాటిల్లో లెమన్ టీ ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ టీ కన్నా రోజూ లెమన్ టీని తాగితే ఎన్నో లాభాలు కలుగుతాయి. దీన్ని సులభంగానే తయారు చేసుకోవచ్చు. అది ఎలాగంటే..
లెమన్ టీ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్లాక్ టీ (టీ డికాషన్) – సగం కప్పు, నీళ్లు – అర కప్పు, పుదీనా ఆకులు – 2, తేనె – ఒక టీస్పూన్, నిమ్మరసం – ఒక టీస్పూన్.
లెమన్ టీని తయారు చేసే విధానం..
ముందుగా నీళ్లలో టీ పొడి వేసి మరిగించి డికాషన్ తయారు చేయాలి. దీన్ని అర కప్పు మోతాదులో తీసుకోవాలి. అలాగే అర కప్పు నీళ్లను మరిగించి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కప్పులో ముందుగా నిమ్మరసం, తేనె, పుదీనా ఆకులు వేయాలి. అనంతరం అందులో ముందుగా సిద్ధం చేసుకున్న టీ డికాషన్ పోయాలి. తరువాత వేడి నీళ్లను పోసి బాగా కలపాలి. అంతే.. దీంతో లెమన్ టీ సిద్ధమవుతుంది. దీన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.
లెమన్ టీలో సబ్జా గింజలు వేసి కూడా తాగవచ్చు. వాటిని ముందుగా కాసేపు నానబెట్టాలి. దీంతో అవి ఉబ్బి తెల్లని భాగం బయటకు వస్తుంది. అలా వచ్చిన గింజలను లెమన్ టీలో కలిపి తాగవచ్చు. దీంతో ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
లెమన్ టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే అదిక బరువు తగ్గుతారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ సాధారణ టీకి బదులుగా లెమన్ టీని తాగితే ప్రయోజనం ఉంటుంది.