గుండె మన శరీరంలో ఉన్న అవయవాలన్నింటిలోనూ ముఖ్యమైనది. అది ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు సంబంధించిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్యాలు చుట్టు ముడతాయి. దీంతో ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. అలాంటి సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన పరిస్థితి వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పౌష్టికాహారం కూడా తీసుకోవాలి. దీంతోపాటు గుండె కొట్టుకునే రేటు(బీపీ)ని రెగ్యులర్‌గా చెక్ చేయించుకుంటే ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చు. అయితే బీపీని చెక్ చేయించుకునే క్రమంలో ఆ రేటు అసాధారణ రీతిలో ఉంటే అప్పుడు ఏదో ఒక అనారోగ్యం వచ్చిందనో, రాబోతుందనో భావించాలి. పలు యూనివర్సిటీలకు చెందిన పరిశోధక బృందాలు తాజాగా చేసిన పరిశోధనల్లో ఈ విషయాలు తెలిశాయి.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడిమియాలజీ నివేదిక ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల హార్ట్ రేట్ 65 నుంచి 85 బీపీఎం మధ్య ఉంటుందట. 85 కన్నాఎక్కువగా హార్ట్ రేట్ ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. గుండె తక్కువగా కొట్టుకునేవారితో పోలిస్తే ఎక్కువగా కొట్టుకునే వారికి 59 శాతం వరకు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుందట. దాదాపు 73 వేల మందిని ఎప్పటికప్పుడు పరిశీలించి, పర్యవేక్షించి పరిశోధన చేయగా ఈ విషయం తెలిసింది. అదేవిధంగా వయస్సు మీద పడుతున్న కొద్దీ బీపీ పెరుగుతుందట. గుండె కొట్టుకోవడం అసాధారణ స్థాయిలో ఉండే వారికి రక్త సరఫరా సరిగా ఉండదట. దీంతో శరీరంలోని పలు అవయవాల పనితీరు దెబ్బతినడమే కాకుండా ఒక్కోసారి మరణం కూడా సంభవించేందుకు అవకాశం ఉంటుందట.
గుండె కొట్టుకోవడం అసాధారణ రీతిలో ఉన్నా, ఎక్కువగా వేగంగా గుండె కొట్టుకున్నా అలాంటి పరిస్థితిని అరిథ్మియా అంటారు. ఈ రుగ్మత ఉన్న వారికి మగతగా, మత్తుగా ఉండడం, గుండె దడ దడగా ఉండడం, ఛాతిలో నొప్పి, అసౌకర్యంగా ఉండడం, స్ప్రహ తప్పి పోవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అరిథ్మియా ఉంటే ఒకానొక సందర్భంలో అవయవాలు సరిగ్గా పనిచేయకుండా పోయి ప్రాణాలకు ప్రమాదం కలిగేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు పలు గుండె జబ్బులు కూడా వస్తాయి. అయితే గుండె కొట్టుకునే రీతిలో స్వల్ప తేడాలు ఉంటే వాటి వల్ల ఎలాంటి అపాయం ఉండదట. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. హార్ట్ ఎటాక్ వచ్చి చికిత్స తీసుకుంటున్న దాదాపు 950 మంది పేషెంట్లను 6 నెలలకోసారి 5 సంవత్సరాల పాటు పూర్తిగా పర్యవేక్షించారు. దీంతో తెలిసిందేమిటంటే ఆరోగ్యవంతమైన హార్ట్ రేట్ ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడరని, అలా లేని వారు అనారోగ్యాల బారిన పడుతున్నారని తేలింది. కాబట్టి మీరు కూడా మీ హార్ట్ రేట్‌పై ఎల్లప్పుడూ ఓ కన్నేయండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి.