మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యమని అందరికీ తెలుసు. అందుకే ఆరోగ్యం బాగుండడానికి పొద్దున్నే లేచి వ్యాయామం చేస్తాం. సరైన ఆహారం తీసుకుంటాం. ఐతే చాలా మంది ఆరోగ్యానికి ఆహారం ముఖ్యం అని భావిస్తారు గానీ మంచినీళ్ళు ముఖ్యమని అనుకోరు. నీళ్ళు తాగడం అనే విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోరు. ఆహారంలో ఎన్ని పోషకాలున్నాయో చూసుకుంటారు గానీ రోజుకి ఎన్ని నీళ్ళు తాగుతున్నామనేది పెద్దగా పట్టించుకోరు. మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇలా జరగడం వల్ల ఎన్నో సమస్యలు పుట్టుకొస్తాయి. శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగకపోవడం వల్ల ఏమేం సమస్యలు వస్తాయో, ఏ సమస్యలు మీ శరీరంలో నీటి శాతం తగ్గుతుందని చూపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
రెగ్యులర్ గా తలనొప్పి బాధిస్తున్నట్లయితే మీ శరీరంలో నీటి శాతం తగ్గిందని చెప్పవచ్చు. తరచుగా నోరు ఎండిపోవడం, నోటి నుండి చెడు వాసన రావడం జరుగుతుంటుంది. నీటి శాతం తగ్గితే మలబద్దకం పెద్ద సమస్యగా మారుతుంది. మలబద్దకం తరచుగా బాధిస్తుంటే నీరు తక్కువ తాగుతున్నారేమో చూసుకోండి.
చేసే పనిమీద దృష్టి నిలపలేకపోవడం, ఏదీ అర్థం చేసుకోకపోవడం మొదలగునవి నీరు తక్కువ తాగితే వచ్చే సమస్యల్లో ఒకటి. ఇంకా, మూత్ర విసర్జన సరిగా జరగకపోవడం, సాధారణంగా విసర్జించాల్సిన దానికన్నా తక్కువ మూత్ర విసర్జ జరగడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ఎముకలు, కీళ్ళలో నొప్పి, చర్మం ఎండిపోవడం, పెదవులు పొడిబారడం వంటి సమస్యలు ఉన్నట్లయితే శరీరంలో నీటి శాతం తగ్గుతుందని గుర్తించాలి. అలానే వదిలేస్తే ఆ సమస్య పెరిగి మరింత తీవ్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది.