వైద్య విజ్ఞానం

నీరు ఎప్ప‌టికీ పాడ‌వ‌దు క‌దా.. మ‌రి వాట‌ర్ బాటిల్స్‌కు ఎందుకు ఎక్స్‌పైరీ ఉంటుంది..?

నీరు జీవకోటికి ప్రాణాధారం. ముఖ్యంగా మనం నీరు లేకుండా అస్సలు ఉండలేం. మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన సహజ సిద్ధ వనరుల్లో నీరు కూడా ఒకటి. ఇది ఎంత కాలం ఉన్నా పాడైపోదు. దీనికి గడువు తేదీ (ఎక్స్‌పైరీ) అంటూ ఉండదు. అయితే మార్కెట్‌లో మనకు దొరికే మినరల్ వాటర్ బాటిల్స్‌పై మాత్రం ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉంటుంది? అసలు దాని అర్థం ఏమిటి? తెలుసుకుందాం రండి. బాటిల్‌లో నిల్వ చేసిన నీరు దానంతట అదే చెడిపోదు. కాకపోతే దాని ప్యాకింగ్, దాని చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు ఆ నీటిని ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా ఆ నీటి నాణ్యతపై ఇవి ప్రభావం చూపిస్తాయి.

సూర్యకాంతిలో నేరుగా నీటితో కూడిన ఓ ప్లాస్టిక్ బాటిల్‌ను ఉంచితే ఆ కాంతిని శోషించుకున్న ప్లాస్టిక్ పలు రసాయన సమ్మేళనాలను నీటిలోకి విడుదల చేస్తుంది. ఈ సమ్మేళనాల్లో ఎక్కువగా బిస్‌ఫినాల్-ఎ (బీపీఏ) వంటివి ఉంటాయి. ఇలాంటి కెమికల్స్ మన శరీరంలోని హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే శరీరంలోని కణజాలం నాశనానికి గురై అది బ్రెస్ క్యాన్సర్, బ్రెయిన్ డ్యామేజ్, పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడం, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలకు దారి తీస్తుంది. అందుకే మనం సూర్యకాంతిలో ఉంచిన బాటిల్‌లోని నీటిని తాగకూడదు. ఒక మినరల్ వాటర్ బాటిల్‌ను వాడిన తరువాత దాన్ని పారేయకుండా మళ్లీ అందులోనే నీటిని నింపి మనం ఆ బాటిల్‌ను పదే పదే ఉపయోగిస్తుంటాం. అయితే ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమట. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త రకం కెమికల్స్ బాటిల్ నుంచి విడుదలై ఆ నీటిలో కలుస్తాయట.

why water in bottles have an expiry date

మినరల్ వాటర్ బాటిల్స్‌ను ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. అయితే ఈ ప్లాస్టిక్‌లో కంటికి కనిపించని పారదర్శకమైన చిన్న చిన్న రంధ్రాలు, సూక్ష్మ నాళికలు ఉంటాయి. అందుకే ఈ బాటిల్స్ బయటి వాతావరణం నుంచి వివిధ రకాల వాసనలను, రుచులను, బాక్టీరియాలను తన లోపలికి గ్రహిస్తాయి. ఈ నేపథ్యంలోనే బాటిల్స్‌ను అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంచితే వాటి చుట్టూ ఉండే వాతావరణ పరిస్థితుల ద్వారా నీరు చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే బాటిల్స్‌ను చల్లగా ఉండే చీకటి లాంటి ప్రదేశాల్లో (ఫ్రిజ్) ఉంచితే ఈ ప్రమాదాలను కొంత వరకు నివారించేందుకు అవకాశం ఉంటుంది.

సాధారణంగా మినరల్ వాటర్ బాటిల్స్‌ను సూర్యకాంతి తాకకుండా, పైన పేర్కొన్న వాతావరణ పరిస్థితుల్లో ఉంచకుండా చూస్తే వాటిని దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఆ బాటిల్స్‌లో బాక్టీరియా పెరిగి నీరు త్వరగా చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇది మనకు అనారోగ్యాలను కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే మీకు ఓ ఆలోచన వచ్చి ఉండాలి. అదేమిటంటే నీటికి ఎక్స్‌పైరీ లేదని. కాకపోతే దాన్ని నిల్వ చేసి ఉంచే ప్లాస్టిక్ బాటిల్స్ వల్లే అది చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. కనుక వాటర్ బాటిల్స్‌లో నీటిని ఎక్కువ రోజులు వాడేవారు ఇప్పటికైనా బీకేర్‌ఫుల్‌గా ఉండండి.

Admin

Recent Posts