ఏ అనారోగ్యం కలిగినా అందుకు సంబంధించిన పలు లక్షణాలు ముందుగా శరీరంలో కనిపిస్తాయి. అయితే కొన్ని వ్యాధులకు సంబంధించి అవి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు మనలో కనిపించవు. అది వేరే విషయం. అయితే శరీరంలో కనిపించే వ్యాధి లక్షణాలనే కాదు, మన కళ్లు ఉన్న స్థితిని బట్టి కూడా మనం ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నామో ఇట్టే చెప్పవచ్చు. కళ్లు రంగు మారినా, ప్రతేకమైన ఆకారాలు కంటి ఎదుట కనిపించినా, కంటి షేప్ మారినా అప్పుడు మనకు ఏయే వ్యాధులు వచ్చాయో తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కార్నియా (కంట్లో నల్లని పాప చుట్టూ ఉండే ప్రదేశం)పై తెల్లని మచ్చలు ఏర్పడితే అప్పుడు మనకు కార్నియా ఇన్‌ఫెక్షన్ వచ్చిందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా ఇది కళ్లకు పెట్టుకునే కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల వస్తుంది. ఎక్స్‌పైర్ అయిన కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకున్నా, ఎక్కువ సమయం పాటు తీయకుండా లెన్స్‌లను అలాగే ఉంచినా ఇలాంటి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
కంట్లో ఉన్న కార్నియా చుట్టూ తెల్లని సర్కిల్ వస్తే అప్పుడు మనకు వయస్సు మీద పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒంట్లో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నా ఇలా తెల్లని సర్కిల్స్ వస్తాయి. అప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుందని తెలుసుకోవాలి. కనుక అలా గనక ఎవరి కళ్లు అయినా కనిపిస్తే వారు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. కళ్లు ఎర్రగా మారితే నిద్ర సరిపోవడం లేదని తెలుసుకోవాలి. బలంగా వీచే గాలిలో ఎక్కువ సేపు ఉన్నా, ఎండలో తిరిగినా కళ్లు ఇలాగే ఎరుపెక్కుతాయి. అలాగే గ్లకోమా, డయాబెటిస్ ఉన్నవారిలోనూ కళ్లు ఇలా ఎరుపెక్కుతాయి. కళ్లు బాగా దురదగా, మంటగా ఉంటే అప్పుడు కళ్లు పూర్తిగా పొడి అయ్యాయని తెలుసుకోవాలి. సాధారణంగా టీవీలు ఎక్కువగా చూసే వారికి, కంప్యూటర్ తెరలను వీక్షించే వారికి ఇలా కళ్లు అవుతుంటాయి. అలాంటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాల సీజనల్ అలర్జీల వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది.
కళ్ల ఎదుట ఒక్కోసారి రంగులేని ఆకారాలు కనిపిస్తుంటాయి. అయితే ఇది సహజమే. ఆందోళన చెందాల్సిన పనిలేదు. కానీ అలా కనిపించడం ఎక్కువైతే మాత్రం జాగ్రత్త పడాలి. ఎందుకంటే కంటిలోని రెటీనా సమస్య గనక ఉన్నట్టయితే అలాంటి వారికి ఇలాంటి ఆకారాలు ఎక్కువగా కనిపిస్తాయి. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. నిద్ర సరిగ్గా పోని వారికి, బాగా ఏడ్చే వారికి, మద్యం సేవించిన వారికి కళ్లు ఉబ్బుతాయి. అది సహజమే. అలా కాకుండా సాధారణ సమయాల్లోనూ కళ్లు ఉబ్బి ఉంటే వైద్యున్ని సంప్రదించాలి. కంటి లోపల ఉండే కనుపాప వద్ద పసుపు పచ్చని మచ్చలు వస్తున్నట్టయితే అప్పుడు వారి కళ్లపై అతినీలలోహిత కిరణాల ప్రభావం అధికంగా పడిందని తెలుసుకోవాలి. ఇలాంటి వారు వీలైనంత వరకు ఎండలో తిరగరాదు. అలాగే వృద్ధాప్యం వస్తున్న వారిలోనూ ఇలాంటి మచ్చలు ఏర్పడుతాయి. అది సహజమే.
బాడా ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు కన్నీళ్లు వస్తాయి. అది సహజమే. అలా కాకుండా మామూలు సమయాల్లోనూ కన్నీళ్లు వస్తుంటే అప్పుడు కళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. అలాగే టీవీలు, కంప్యూటర్లపై ఎక్కువ సేపు పని చేసే వారికి కూడా అలా అసంకల్పితంగా అప్పుడప్పుడు కన్నీళ్లు వస్తాయి. కళ్లను మూసినా, తెరచినా నల్లని గీతలు, వలయాలు కనిపిస్తూ ఉంటే అప్పుడు మెదడుకు సరిగ్గా రక్త సరఫరా కావడం లేదని తెలుసుకోవాలి. వృద్ధాప్యం వస్తున్న వారిలోనూ ఇలా కనిపిస్తాయి. అది సహజమే. మామూలు వారికి వస్తే అప్పుడు కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. కొందరికి అప్పుడప్పుడు కళ్ల ఎదుట మనుషులు మాయమైనట్టు కనిపిస్తారు. అలా ఎందుకు జరుగుతుందంటే మైగ్రేన్ సమస్య అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటే అలా జరుగుతుంది. అలాంటి వారు సరైన సమయంలో స్పందించి చికిత్స తీసుకోవాలి.
డయాబెటిస్ లేదా మయోపియా అనే వ్యాధి ఉన్నవారిలో చూపు అస్పష్టంగా ఉంటుంది. లేదంటే కంటిలో శుక్లాలు కూడా ఉండి ఉండవచ్చు. ఏదైనా తగిన సమయంలో స్పందిస్తే కంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. హెపటైటిస్ వ్యాధులతో బాధపడేవారి కళ్లు పసుపు పచ్చగా ఉంటాయి. లివర్ సమస్యలు ఉన్నా కళ్లు ఇదే రంగులోకి మారుతాయి. ఇలాంటి వారు వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.