Theatres : ఏపీలో గత కొద్ది నెలలుగా సినిమా టిక్కెట్ల ధరలపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం విదితమే. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. అలాగే ఇటీవల పలువురు హీరోలతో కలిసి మరోమారు జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల సమస్యను పరిష్కరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ఏపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులతోపాటు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా ఉన్నారు. అయితే ఆ కమిటీ గురువారం ఏపీ ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పించింది. దీంతో సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను ఎప్పుడు విడుదల చేస్తుందా.. అని సినీ వర్గాలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నాయి.
అయితే గురువారం ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనా నిబంధలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చిత్ర పరిశ్రమకు చాలా ఊరట లభించింది. ఇకపై ఏపీలోనూ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించుకోవచ్చు. అయితే 100 శాతం ఆక్యుపెన్సీకి థియేటర్లలో అవకాశం కల్పించినప్పటికీ సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఎటూ తేల్చలేదు.
మరోవైపు సదరు కమిటీ ఇచ్చిన నివేదికను ఏపీ ప్రభుత్వం పరిశీలించి దానిపై నిర్ణయం తీసుకునేందుకు కనీసం 7 నుంచి 10 రోజులు అయినా సమయం పడుతుందని భావిస్తున్నారు. దీంతో మరో 10 రోజుల్లో సినిమా టిక్కెట్ల ధరలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే కొద్ది రోజులకు ఎటూ సమస్య పరిష్కారం అవుతుంది కానీ.. టిక్కెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వ జీవో మాత్రం భీమ్లా నాయక్ రిలీజ్‌కు ముందు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. లేదా సినిమా విడుదలకు ఒక రోజు అటు లేదా ఇటు జీవో విడుదలయ్యే అవకాశం కూడా ఉందంటున్నారు. కనుక.. భీమ్లా నాయక్ మేకర్స్ ఈ జీవోపై పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఒక వేళ ఆ సమయానికి జీవో వస్తే మాత్రం అది లక్ అనుకోవాల్సిందేనని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా వరకు ఊరటనిస్తుందని చెప్పవచ్చు.