3 Dal Masala Vada : క్రిస్పీగా ఉండే మూడు పప్పుల మసాలా వడ.. త‌యారీ ఇలా..!

3 Dal Masala Vada : మ‌న‌కు సాయంత్రం స‌మయంలో రక‌ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో మ‌సాలా వ‌డ‌లు కూడా ఒక‌టి. మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే సాధార‌ణంగా మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌ప‌ప్పుతో పాటు మిన‌ప‌ప్పు, కందిప‌ప్పు వేసి కూడా ఈ మ‌సాలా వ‌డ‌ల‌ను మ‌నం త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా చేసిన మ‌సాలా వ‌డ క‌ర‌క‌ర‌లాడుతూ చాలా రుచిగా ఉంటుంది. 3 ర‌కాల ప‌ప్పుల‌తో మ‌సాలా వ‌డ‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మూడు ప‌ప్పుల మ‌సాలా వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప‌ప్పు – 1/3 క‌ప్పు , కందిప‌ప్పు – 1/3 క‌ప్పు,శ‌న‌గ‌ప‌ప్పు – 1/3 క‌ప్పు, సోంపు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బ‌లు – 5, అల్లం – ఒక ఇంచు ముక్క‌, ఎండుమిర్చి – 2, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, ఉప్పు – త‌గినంత‌, ఉల్లిపాయ త‌రుగు – అర క‌ప్పు, కొత్తిమీర త‌రుగు – పావు క‌ప్పు, పుదీనా – పావు క‌ప్పు, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

3 Dal Masala Vada recipe in telugu make in this method
3 Dal Masala Vada

మూడు పప్పుల మ‌సాలా వ‌డ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ప‌ప్పుల‌ను వేసి బాగా క‌డ‌గాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 4 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని పూర్తిగా వ‌డ‌క‌ట్టాలి. ఇప్పుడు ఈ ప‌ప్పుల నుండి గుప్పెడు ప‌ప్పును తీసి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత మిగిలిన ప‌ప్పును జార్ లోకి తీసుకోవాలి. ఇందులో జీల‌క‌ర్ర‌, సోంపు, ప‌చ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి ర‌వ్వ‌లా బ‌ర‌క‌గా మిక్సీ ప‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌క్క‌కు ఉంచిన ప‌ప్పుల‌తో పాటు మిగిలిన ప‌దార్థాలన్నీ వేసి నీళ్లు పోయ‌కుండా బాగా క‌ల‌పాలి. పిండి మెత్త‌గా అయితే ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి క‌లుపుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న పిండిని పెద్ద నిమ్మ‌కాయంత ఉండ‌లుగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడ‌య్యాక ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ వ‌డ‌లాగా వ‌త్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని 3 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా అలాగే ఉంచాలి. 3 నిమిషాల త‌రువాత అటూ ఇటూ తిప్పుతూ మ‌ధ్య‌స్థ మంటపై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌ప్పుల మ‌సాలా వ‌డ త‌యార‌వుతుంది. దీనిని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా తిన‌డానికి ఈ వ‌డ‌లు చాలా చ‌క్క‌గా ఉంటాయి.

D

Recent Posts