Paneer Butter Masala Dum Biryani : మనం పనీర్ తో రకరకాల వంటకాలను వండుకుని తింటూ ఉంటాం. పనీర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది పనీర్ ను ఇష్టంగా తింటారు. మనకు రెస్టారెంట్ లలో కూడా పనీర్ తో చేసిన అనేక రకాల వంటకాలు లభిస్తూ ఉంటాయి. మనకు రెస్టారెంట్ లలో ఎక్కువగా లభించే పనీర్ వంటకాల్లో పనీర్ బటర్ మసాలా ధమ్ బిర్యానీ కూడా ఒకటి. నాన్ వెజ్ బిర్యానీలకు ఏ మాత్రం తక్కువపోనంత రుచిగా ఉంటుంది ఈ పనీర్ బిర్యానీ. ఈ పనీర్ బటర్ మసాలా ధమ్ బిర్యానీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా అదే రుచితో తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే పనీర్ బటర్ మసాలా ధమ్ బిర్యానీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పనీర్ బటర్ మసాలా ధమ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
జీలకర్ర పొడి – ముప్పావు టీ స్పూన్, ధనియాల పొడి – ముప్పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, కాశ్మీరి చిల్లీ కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, గరం మసాలా – అర టీ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – ఒక చిన్న కట్ట, తరిగిన పుదీనా – ఒక చిన్న కట్ట, ఫ్రైడ్ ఆనియన్స్ – అర కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, బటర్ – 3 క్యూబ్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పన్నీర్ క్యూబ్స్ – 300 గ్రా., ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్.
గ్రేవీ తయారీకి కావల్సిన పదార్థాలు..
యాలకులు – 2, లవంగాలు – 2, బిర్యానీ ఆకు – 1 ( చిన్నది), మిరియాలు – అర టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, జీడిపప్పు – 15, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన టమాటాలు – 3, కాశ్మీరి కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – 350 ఎమ్ ఎల్, కసూరి మెంతి- ఒక టీ స్పూన్.
అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యం – 2 కప్పులు, మరాఠీ మొగ్గలు – 2, జాపత్రి – 2, అనాస పువ్వులు – 2, లవంగాలు – 6, యాలకులు – 5, దాల్చిన చెక్క – రెండు ముక్కలు, సాజీరా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, ఉప్పు – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – చిన్న కట్ట, తరిగిన కొత్తిమీర – చిన్న కట్ట.
పనీర్ బటర్ మసాలా ధమ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో గ్రేవీ కావల్సిన పదార్థాలన్నీ వేసి మూత పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ టమాట గ్రేవీని బిర్యానీ గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఇందులో పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, పెరుగు తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి చేత్తో కలుపుతూ తరువాత పన్నీర్, క్రీమ్, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే బియ్యం, కొత్తిమీర, పుదీనా తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం, కొత్తిమీర, పుదీనా వేసి బియ్యాన్ని 80 శాతం ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత దానిని పూర్తిగా వడకట్టి ముందుగా తయారు చేసుకున్న గ్రేవీ మీద సమానంగా వేసుకోవాలి. తరువాత దీనిపై ఫుడ్ కలర్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి.
తరువాత కొత్తమీర, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ ను చల్లుకోవాలి. తరువాత గిన్నె అంచుల వెంబడి మైదాపిండి ముద్దను చుట్టుకుని ఒక చోట చిన్న సందును ఉంచాలి. తరువాత దీనిపై గట్టిగా మూతను ఉంచాలి. ఇప్పుడు దీనిని ఆవిరి వేగంగా బయటకు వచ్చే వరకు పెద్ద మంటపై ఉడికించాలి. ఆవిరి బయటకు రాగానే మంటను చిన్నగా చేసి గిన్నె అంచులను అటూ ఇటూ తిప్పుతూ రెండేసి నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తరువాత గిన్నెను స్టవ్ మీద ఉంచి మధ్యలో 2 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ బటర్ మసాలా ధమ్ బిర్యానీ తయారవుతుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా పనీర్ తో ధమ్ బిర్యానీని వండుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.