Aadhi Pinisetty : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య యువ హీరో, హీరోయిన్ల పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. శింబు, నిధి అగర్వాల్ లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా మరో జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరో ఆది పినిశెట్టి, గ్లామరస్ బ్యూటీ నిక్కీ గల్రానీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్త వైరల్ అవుతోంది.
తమిళంలో యగవరయినమ్ నా కాక్క, మరగధ నాయనమ్ సినిమాలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు జంటగా నటించారు. ఈ సినిమాలతో వారు, వారి కుటుంబ సభ్యులు కూడా స్నేహితులుగా మారారు. ఈ స్నేహ బందాన్ని వీరు నెక్ట్స్ లెవల్‌కు తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. చాలా కాలంగా ఈ జంట రిలేషన్ షిప్‌లో ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దగ్గరి బంధువుల సమక్షంలో నిశ్చితార్థ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని, త్వరలో వీరి తల్లిదండ్రులు వివాహ తేదీని ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
కాగా ఆది పినిశెట్టి 2006 లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఒక వి చిత్రం అనే సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. దీని తరువాత 2007లో వచ్చిన మిరుగమ్ అనే తమిళ సినిమాలో నటించాడు. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమాలో ఆది పినిశెట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ఎన్.లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. నిక్కీ గల్రానీ 1983, డార్లింగ్, వెల్లిమూంగ, కళకళప్పు 2 తదితర చిత్రాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వీరి పెళ్లి వార్త వైరల్‌గా మారింది.