Allam Chutney : మనం అనేక రకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తీసుకోవడానికి వివిధ రకాల చట్నీలను కూడా తయారు చేస్తూ ఉంటాం. వాటిలో అల్లం చట్నీ కూడా ఒకటి. దోశ, పెసరట్టు, ఇడ్లీ, వడ వంటి వాటిని అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. హోటల్స్ లో, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో కూడా ఈ అల్లం చట్నీ మనకు లభిస్తూ ఉంటుంది. అచ్చం బయట లభించే విధంగా ఉండే అల్లం చట్నీని మనం ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం చట్నీ తయారీకి కావల్సిన పదార్థాలు..
అల్లం – 3 ఇంచుల ముక్క, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిరపకాయలు – 5 లేదా 6, పుట్నాలు – ఒక టేబుల్ స్పూన్, మినప పప్పు – 2 టీ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 4, చింతపండు – కొద్దిగా, ఉప్పు – తగినంత, బెల్లం తరుము – రెండు టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని.
అల్లం చట్నీ తయారీ విధానం..
ముందుగా అల్లాన్ని శుభ్రపరిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత అల్లం ముక్కలను వేసి వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేగిన తరువాత ఎండు మిరపకాయలు, పుట్నాలు, మినప పప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, టమాట ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిపై మూతను ఉంచి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిన తరువాత పసుపు వేసి కలుపుకోవాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలి.
తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇంతులోనే ఉప్పు, బెల్లం తురుము వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ తయారవుతుంది. ఈ చట్నీని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు రోజుల వరకు తాజాగా ఉంటుంది. ఉదయం చేసే అల్పాహారాలను ఈ అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా అల్లాన్ని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.