Aloo Stuffed Mirchi Bajji : ఆలును స్టఫ్ చేసి మిర్చి బ‌జ్జి ఇలా చేయండి.. రుచి అదిరిపోతుంది..!

Aloo Stuffed Mirchi Bajji : మనం సాయంత్రం స‌మ‌యాల్లో ఎక్కువ‌గా త‌యారు చేసే చిరుతిళ్ల‌ల్లో బ‌జ్జీలు కూడా ఒక‌టి. బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మ‌నం మ‌న రుచికి త‌గిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన బ‌జ్జీ వెరైటీలల్లో ఆలూ స్ట‌ఫ్డ్ బ‌జ్జీ మిర్చి కూడా ఒక‌టి. బంగాళాదుంప స్ట‌ఫింగ్ తో చేసే ఈ బ‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌కు హోట‌ల్స్, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా ఈ బ‌జ్జీలు ల‌భిస్తూ ఉంటాయి. ఈ స్ట‌ఫ్డ్ మిర్చి బ‌జ్జీల‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. టీ టైంలో స్నాక్స్ గా తీసుకోవ‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటాయి. పైన క్రిస్పీగా, రుచిగా ఉండే ఆలూ స్ట‌ఫ్డ్ మిర్చి బ‌జ్జీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ స్ట‌ఫ్డ్ మిర్చి బ‌జ్జీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, చిన్న‌గా తరిగిన ఉల్లిపాయ – చిన్న‌ది ఒక‌టి, కారం – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, ప‌సుపు – కొద్దిగా, ఉడికించిన బంగాళాదుంప‌లు – పెద్ద‌వి రెండు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నిమ్మ‌ర‌సం – అరచెక్క‌, బ‌జ్జీ మిర్చి – 10, శ‌న‌గ‌పిండి – 200 గ్రా., వంట‌సోడా – రెండు చిటికెలు.

Aloo Stuffed Mirchi Bajji recipe in telugu how to make them
Aloo Stuffed Mirchi Bajji

ఆలూ స్ట‌ఫ్డ్ మిర్చి బ‌జ్జీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడిచేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత కారం, ఉప్పు, చాట్ మ‌సాలా, ప‌సుపు వేసి వేయించాలి. త‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌ల‌ను ఉండలు లేకుండా మెత్త‌గా చేసుకుని వేసుకోవాలి. దీనిని అంతా క‌లిసేలా క‌లుపుకున్న త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నిమ్మ‌ర‌సం, కొత్తిమీర వేసి క‌లిపి పక్క‌కు ఉంచాలి. త‌రువాత బ‌జ్జీ మిర్చీల‌ను తీసుకుని వాటికి నిలువుగా గాట్లు పెట్టి వాటిలో ఉండే గింజ‌ల‌ను తీసివేయాలి. త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న ఆలూ మిశ్ర‌మాన్ని ఈ బజ్జీల‌ల్లో స్ట‌ఫ్ చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత గిన్నెలో శ‌న‌గ‌పిండిని తీసుకోవాలి.

త‌రువాత ఇందులో కొద్దిగా జీల‌క‌ర్ర‌, ఒక టీ స్పూన్ కారం, ఉప్పు, ప‌సుపు, వంట‌సోడా వేసి క‌ల‌పాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి పిండిని ప‌లుచ‌గా క‌లుపుకోవాలి. త‌రువాత క‌ళాయిలో డీప్ ఫ్రైకు స‌రిప‌డా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మిర్చిని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై గోల్డెన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ స్ట‌ఫ్డ్ మిర్చి బ‌జ్జీ త‌యార‌వుతుంది. ఈ విధంగా తయారు చేసిన మిర్చి బ‌జ్జీల‌ను ఒక్క‌టి కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts