Aloo Tomato Curry : ఆలూ ట‌మాటా క‌ర్రీని ఇలా చేస్తే.. చ‌పాతీలు.. అన్నం.. ఎందులోకి అయినా స‌రే బాగుంటుంది..

Aloo Tomato Curry : మ‌నం త‌రచుగా బంగాళాదుంప‌ల‌తో చేసే వంట‌కాల్లో ట‌మాట బంగాళాదుంప కూర ఒక‌టి. ఈ కూర‌తో చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూర‌ను ఇష్టంగా తింటారు. చ‌క్క‌గా చేయాలే కానీ ఈ ట‌మాట బంగాళాదుంప కూరను వ‌దిలి పెట్ట‌కుండా ఇష్టంగా తింటారు. మ‌రింత రుచిగా, సులువుగా ఆలూ ట‌మాట క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ ట‌మాట క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

ఉడికించిన బంగాళాదుంప‌లు – 4, త‌రిగిన ట‌మాటాలు – 5, నూనె – రెండు టేబుల్ స్పూన్స్, ల‌వంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, నీళ్లు – అర గ్లాస్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Aloo Tomato Curry recipe in telugu best for rice or chapati
Aloo Tomato Curry

ఆలూ ట‌మాట క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ల‌వంగాలు, దాల్చిన చెక్క‌, యాల‌కులు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత అల్లం పేస్ట్, క‌రివేపాకు వేసి వేయించాలి.ఇవి వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌లు, కొద్దిగా ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. వీటిని మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత కారం, ధ‌నియాల పొడి, గ‌రం మసాలా, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత ఉడికించ‌న బంగాళాదుంప‌ల‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి.

త‌రువాత రుచికి త‌గిన‌ట్టుగా మ‌రికొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి క‌ల‌పాలి. దీనిపై మూత‌ను ఉంచి మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివర‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ ట‌మాట క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే ఆలూ ట‌మాట కూర కంటే ఈ విధంగా చేసిన ఆలూ ట‌మాట కూర మ‌రింత రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts