Alu Rice : కూర చేసే స‌మయం లేక‌పోతే.. ఆలు రైస్‌ను చేసి తిన‌వ‌చ్చు..!

Alu Rice : ఆలుగ‌డ్డ‌ల‌ను మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు పోషకాలు కూడా ల‌భిస్తాయి. ఆలుగ‌డ్డ‌ల‌తో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. అయితే వీటిని ఉప‌యోగించి రైస్‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా కూర త‌యారు చేసే సమ‌యం లేక‌పోతే దీన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం ఇది మ‌న‌కు ఆహారంగా ప‌నిచేస్తుంది. ఉద‌యం చేసుకుంటే బ్రేక్ ఫాస్ట్‌లా తిన‌వ‌చ్చు. అదే మ‌ధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి వండుకోవ‌చ్చు. దీంతో ఎంతో రుచిక‌ర‌మైన రైస్‌ను మ‌నం ఆస్వాదించ‌వ‌చ్చు. పైగా చాలా త‌క్కువ స‌మ‌యంలో త‌యార‌వుతుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Alu Rice is perfect for breakfast or lunch
Alu Rice

ఆలు రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అన్నం – 1 క‌ప్పు, ఆలుగ‌డ్డ‌లు – 2 (ఉడ‌క‌బెట్టిన‌వి), ఉల్లిపాయ – 1 (ముక్క‌లుగా క‌ట్ చేయాలి), వెల్లుల్లి రెబ్బ‌లు – 2 (ముక్క‌లుగా క‌ట్ చేయాలి), పుదీనా త‌రుగు – 2 టీస్పూన్లు, ప‌చ్చి మిర్చి – 1, గ‌రం మ‌సాలా, సాజీరా – అర‌ టీ స్పూన్, కారం – పావు టీస్పూన్, ప‌సుపు – చిటికెడు, నూనె, ఉప్పు – త‌గినంత, బిరియానీ ఆకు, జాజికాయ – ఒక్కొక్క‌టి, యాల‌కులు – 4, దాల్చిన చెక్క – 1 అంగుళం, ల‌వంగాలు – 6.

ఆలు రైస్ ను త‌యారు చేసే విధానం..

ఆలుగ‌డ్డ‌ల‌ను నీళ్లు పోసి ఉడ‌క‌బెట్టాలి. ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. అనంత‌రం అందులో బిర్యానీ ఆకు, యాల‌కులు, దాల్చిన చెక్క, ల‌వంగాలు, ప‌చ్చి మిర్చి, సాజీరా, జాజికాయ వేసి వేయించాలి. అందులో ఉల్లిపాయ‌లు, వెల్లుల్లి వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి. అనంత‌రం ఉడ‌క‌బెట్టిన‌ ఆలుగ‌డ్డ ముక్క‌ల‌ను వేయాలి. వాటిని కొంత‌సేపు ఫ్రై చేయాలి.

అనంత‌రం అందులో ప‌సుపు, ఉప్పు, కారం, పుదీనా ఆకులు, గ‌రం మ‌సాలా వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత అన్నం వేయాలి. రెండు నిమిషాల పాటు బాగా క‌ల‌పాలి. అనంత‌రం కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో ఆలురైస్ త‌యార‌వుతుంది. దీన్ని రైతాతో క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా నేరుగా కూడా తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లేదా మ‌ధ్యాహ్నం లంచ్‌లోకి బాగా సెట్ అవుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts