Atukula Upma Poha : అటుకుల‌తో ఉప్మా.. పోహా.. సింపుల్‌గా ఇలా చేసేయండి.. మెత్త‌గా.. బాగుంటుంది..!

Atukula Upma Poha : మనం సాధార‌ణంగా అటుకుల‌ను వంటింట్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. అటుకుల వల్ల కూడా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అటుకుల‌లో ఐర‌న్, కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో త‌యారు చేసే వాటిల్లో అటుకుల ఉప్మా (పోహా) ఒక‌టి. మ‌న‌లో చాలా మంది పోహాను త‌యారు చేస్తూ ఉంటారు. పోహాను త‌యారు చేసిన కొద్ది స‌మ‌యానికే అటుకులు గ‌ట్టి ప‌డి తిన‌డానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ విధంగా అటుకులు గ‌ట్టి ప‌డ‌కుండా మెత్త‌గా ఉండి, మ‌రింత రుచిగా పోహాను ఎలా త‌యారు చేసుకోవాలి, వాటికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

Atukula Upma Poha making recipe good taste
Atukula Upma Poha

అటుకుల ఉప్మా (పోహా) తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మంద‌మైన‌ అటుకులు – 2 క‌ప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్‌, ప‌ల్లీలు – పావు క‌ప్పు, ఆవాలు – ఒక టేబుల్ స్పూన్‌, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్‌, ఇంగువ – చిటికెడు, త‌రిగిన ప‌చ్చి మిర్చి ముక్క‌లు – ఒకటిన్న‌ర టేబుల్ స్పూన్‌, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన ఉల్లిపాయ‌లు – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన బంగాళాదుంప ముక్క‌లు – అర క‌ప్పు, ప‌సుపు – అర టేబుల్ స్పూన్‌, ఉప్పు – రుచికి స‌రిప‌డా, పంచ‌దార – ముప్పావు టేబుల్ స్పూన్‌, నీళ్లు – 300ఎంఎల్‌, త‌రిగిన కొత్తిమీర – త‌గినంత‌, నిమ్మర‌సం – అర టేబుల్ స్పూన్.

అటుకుల ఉప్మా (పోహా) త‌యారీ విధానం..

ముందుగా అటుకుల‌ను జ‌ల్లెడ ప‌ట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అటుకుల‌లో ఉండే చెత్త‌, పొట్టు పోతాయి. ఇప్పుడు ఒక జ‌ల్లి గిన్నెలో అటుకుల‌ను వేసి అటుకులు త‌డిసే వ‌ర‌కు నీళ్లను పోయాలి. అటుకుల‌ను నీళ్ల‌లో నాన‌బెట్ట కూడ‌దు. ఇలా త‌డిసిన అటుకుల‌ను తీసి ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక పల్లీల‌ను వేసి త‌క్కువ మంటపై వేయించుకోవాలి. వేగిన ప‌ల్లీల‌ను తీసి ప‌క్క‌కు పెట్టి అదే క‌ళాయిలో ఆవాలు, జీల‌క‌ర్ర‌, ఇంగువ‌, ప‌చ్చి మిర్చి ముక్క‌లు, క‌రివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

ఉల్లిపాయ ముక్క‌ల నుండి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకున్న త‌రువాత త‌రిగిన బంగాళా దుంప‌ల ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు, పంచ‌దార వేసి క‌లిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి వేగాక 3 టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను పోసి మూత పెట్టి మ‌ధ్య‌స్థ మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆలుగ‌డ్డ ముక్క‌లు ఉడికిన త‌రువాత ముందుగా త‌డిపి పెట్టుకున్న అటుకుల‌ను వేసి బాగా క‌లుపుకోవాలి. ఇలా క‌లిపిన త‌రువాత మ‌రో 3 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి మూత పెట్టి 6 నుంచి 7 నిమిషాల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అటుకులు గ‌ట్టిప‌డ‌కుండా మెత్త‌గా ఉంటాయి.

ఇప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న ప‌ల్లీలు, త‌రిగిన కొత్తిమీర‌, నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి. దీంతో ఎంతో రుచిగా ఉండే అటుకుల ఉప్మా (పోహా) త‌యార‌వుతుంది. దీనిని వేడిగా, చ‌ల్ల‌గా ఎలా తిన్నా కూడా అటుకులు గ‌ట్టి ప‌డ‌కుండా మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా పోహాను చాలా తక్కువ స‌మ‌యంలోనే ఎంతో రుచిక‌రంగా ఉండేలా త‌యారు చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts