Curry Leaves : కరివేపాకును కూరలో కనిపిస్తే తీసి పారేస్తుంటారు కొందరు. ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప చాలా మంది కూరలో కరివేపాకును తినడానికి ఇష్టపడరు. కానీ కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆధునిక పరిశోధకులు. ఐరన్ లోపం వల్ల రక్త హీనత వస్తుందని తెలిసిందే. కానీ అది లేకపోవడమే కాదు, దాన్ని శోషించుకోలేకపోవడం వల్ల కూడా రక్తహీనత వస్తుంది. అలా శరీరం ఐరన్ తీసుకోడానికి ఫోలిక్ యాసిడ్ దోహదపడుతుంది.
ఐరన్, ఫోలిక్ ఆమ్లం కరివేపాకులో సమృద్ధిగా ఉండం వల్ల రక్తహీనతను అధిగమించేందుకు దీన్ని మించింది లేదు అంటున్నారు ఆహార నిపుణులు. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. ఆయుర్వేదం ప్రకారం పొట్టలోని విషపూరితాలను సైతం కరివేపాకు చక్కగా తొలగిస్తుంది. అజీర్తిని పోగొట్టి జీర్ణ శక్తిని పెంచుతుంది. కాలేయం దెబ్బ తిన్న వాళ్లకి కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని క్యాంఫెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని, హానికర రసాయనాలను తొలగిస్తుంది.
టీ స్పూన్ నెయ్యిలో అర కప్పు కరివేపాకు రసం, కాస్త పంచదార, మిరియాల పొడి వేసి సిమ్ లో మరిగించి తీసుకుంటే కాలేయ సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. కరివేపాకులోని పీచు కారణంగా రక్తంలో చక్కెర నిల్వలు కూడా తగ్గుతాయి. ఇది కొవ్వును సైతం కరిగిస్తుంది. దాంతో బరువు కూడా తగ్గుతారు. పరగడుపున కొద్దిగా పచ్చి కరివేపాకును తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకుకు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఇది విరేచనాలని తగ్గిస్తుంది. వ్యాధి వెంటనే తగ్గాలంటే చిన్నరేగు పండు సైజులో కరివేపాకును ముద్దలా చేసి మజ్జిగతో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి. దీంతో సమస్య తగ్గుతుంది.