Bachelor Style Chicken Curry : బ్యాచిల‌ర్ స్టైల్‌లో సింపుల్‌గా చికెన్ కర్రీని ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Bachelor Style Chicken Curry : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్ల‌ను, ఇత‌ర పోష‌కాలను క‌లిగి ఉండే ఆహారాల్లో చికెన్ ఒక‌టి. చికెన్ ను మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో ఎక్కువ‌గా చేసే వంట‌కాల్లో చికెన్ క‌ర్రీ ఒక‌టి. ఈ చికెన్ క‌ర్రీని వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. బ్యాచిల‌ర్స్ అలాగే వంట‌రాని వారు కూడా చేసే విధంగా త‌క్కువ శ్ర‌మ‌తో సుల‌భంగా, రుచిగా ఉండేలా ఈ చికెన్ క‌ర్రీని ఎలా త‌యారు చేయాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చికెన్ క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

చికెన్ – అర కిలో, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర‌ టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – 1, బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, అనాస పువ్వు – 1, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – అర క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, చిన్న‌గా త‌రిగిన ట‌మాటాలు – 2 ( చిన్న‌వి), పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, నీళ్లు – అర క‌ప్పు, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా పొడి – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా.

Bachelor Style Chicken Curry you can make this in simple way
Bachelor Style Chicken Curry

చికెన్ క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా చికెన్ ను ఉప్పు, నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌డిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, పావు టీ స్పూన్ ప‌సుపు, కారం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక మ‌సాలా దినుసులు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అల్లం పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి క‌లిపి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత పెరుగు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ చికెన్ పూర్తిగా ఉడికే వ‌ర‌కు ఉడికించాలి. చికెన్ ఉడికిన త‌రువాత ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. తరువాత నీళ్లు పోసి మూత పెట్టి మ‌రో 5 నుండి 10 నిమిషాల వ‌ర‌కు చిన్న మంట‌పై ఉడికించాలి. త‌రువాత ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా పొడి, కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. దీనిపై మూత‌ను ఉంచి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటి, పుల్కా, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts