Beerakaya Tomato Pachadi : బీరకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. బీరకాయలతో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు మనం ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కేవలం కూరలే కాకుండా బీరకాయలతో మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. బీరకాయ పచ్చడిని మనలో చాలా మంది తయారు చేస్తూ ఉంటారు. తరచూ చేసే ఈ బీరకాయ పచ్చడిలో టమాటాలు వేసి దీనిని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ టమాట పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన బీరకాయలు – పావు కిలో, తరిగిన టమాటాలు – 3 ( మధ్యస్థంగా ఉన్నవి), పచ్చిమిర్చి – 10 లేదా 12, నూనె – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, జీలకర్ర – అర టీ స్పూన్, చింతపండు – ఒక రెమ్మ, వెల్లుల్లి రెబ్బలు – 6.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
బీరకాయ టమాట పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మినపప్పు వేసి వేయించాలి. తరువాత దీనిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో పచ్చిమిర్చి వేసి వేయించాలి. పచ్చిమిర్చి ఎర్రగా వేగిన తరువాత దీనిని కూడా జార్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో మరో టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక టమాట ముక్కలు, బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, చింతపండు వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి మధ్యస్థ మంటపై పూర్తిగా మగ్గించాలి. ఇప్పుడు జార్ లో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులోనే ఉడికించిన బీరకాయ ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. తరువాత ఈ తాళింపును ముందుగా తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ టమాట పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. బీరకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పచ్చడిని కూడా తయారు చేసుకుని తినవచ్చు.