Beetroot Pappu : బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పు కూడా చేయ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Beetroot Pappu : చూసేందుకు ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్ అంటే కొంద‌రికి మాత్ర‌మే ఇష్టంగా ఉంటుంది. దీన్ని చాలా మంది తిన‌రు. దీన్ని ముట్టుకుంటే చాలు రంగు అంటుతుంది. రుచిగా కూడా ఉండ‌దు. క‌నుక బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీన్ని జ్యూస్‌లా చేసుకుని లేదా నేరుగా ప‌చ్చిగానే తిన‌వ‌చ్చు. అయితే బీట్ రూట్‌తో ఎంతో రుచిగా ఉండే ప‌ప్పును కూడా చేయ‌వ‌చ్చు. దీన్ని చేయడం చాలా సుల‌భం. రుచిగా ఉంటుంది. అంద‌రికీ న‌చ్చుతుంది. బీట్ రూట్‌తో ప‌ప్పును ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్‌రూట్ ప‌ప్పు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పాల‌కూర త‌రుగు – అర క‌ప్పు, కంది ప‌ప్పు – 1 క‌ప్పు, బీట్ రూట్ ముక్క‌లు – పావు క‌ప్పు, పచ్చి మిర్చి – 3, క‌రివేపాకు – 2 రెబ్బ‌లు, ఉల్లిపాయ – 1 చిన్న‌ది, ప‌సుపు – పావు టీస్పూన్‌, కారం – 1 టీస్పూన్‌, ఉప్పు – త‌గినంత‌, చింత‌పండు పులుసు – 3 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – 2, పోపు దినుసులు – పావు టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, వెల్లుల్లి రెబ్బ‌లు – 4, నూనె – 3 టీస్పూన్లు, నెయ్యి – 1 టీస్పూన్‌.

Beetroot Pappu recipe in telugu very easy to cook
Beetroot Pappu

బీట్ రూట్ ప‌ప్పును త‌యారు చేసే విధానం..

కందిప‌ప్పును క‌డిగి నీళ్లు పోసి కాస్త ప‌సుపు, కొద్దిగా నూనె వేసి కుక్క‌ర్‌లో మెత్త‌గా ఉడికించుకోవాలి. పాల‌కూర ఆకుల‌ను క‌డిగి త‌రిగి పెట్టుకోవాలి. బీట్ రూట్‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. మంద‌పాటి గిన్నె లేదా పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడి చేసి స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు, నిలువుగా చీల్చిన ప‌చ్చి మిర్చి వేసి కొద్దిగా వేగాక బీట్ రూట్ ముక్క‌లు లేదా వాటి త‌రుగు వేసి మ‌రి కొద్దిసేపు వేయించాలి. ఇందులో ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత పాల‌కూర వేసి క‌లిపి మూత పెట్టాలి. అవ‌స‌రం అయితే ఒక క‌ప్పు నీళ్లు పోయాలి.

పాల‌కూర‌, బీట్‌రూట్ ఉడికిన త‌రువాత చింత‌పండు పులుసు, మెదిపిన కందిప‌ప్పు, త‌గినంత ఉప్పు వేసి క‌లియ‌బెట్టాలి. మొత్తం క‌లిపి ఉడికిన త‌రువాత దింపేయాలి. వేరొక గిన్నె లేదా గ‌రిట‌లో మిగిలిన నూనె, నెయ్యి వేసి వేడి చేసి పోపు గింజ‌లు, ఎండు మిర్చి వేసి చిట‌ప‌ట‌లాడాక క‌రివేపాకు, న‌ల‌గ్గొట్టిన వెల్లుల్లి రెబ్బ‌లు వేయాలి. ఇవి కాస్త ఎర్ర‌బ‌డ‌గానే ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఈ ప‌ప్పు, అన్నం, చ‌పాతీల‌లోకి కూడా బాగుంటుంది. దొరికితే పాల‌కూర బ‌దులు బీట్‌రూట్ ఆకుల‌తోనూ ప‌ప్పు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Editor

Recent Posts