Bellam Palathalikalu : పాలతాలికలు.. మనకు ఉన్న సంప్రదాయ వంటకాల్లో ఇది కూడా ఒకటి. పాలతాలికలు చాలా రుచిగా ఉంటాయి. పాలతాలికలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పాల తాలికలను తయారు చేయడం చాలా సులభం. అయితే పాల తాలికలను బెల్లంతో చేసేటప్పుడు పాలు విరిగిపోతాయని చాలా మంది వీటిని తయారు చేయడానికే భయపడుతూ ఉంటారు. కానీ పాలు విరగకుండా రుచికరమైన పాలతాలికలను మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పాలు విరగకుండా రుచిగా ఉండే పాలతాలికలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లం పాలతాలికల తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక కప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, బియ్యం పిండి – ఒక కప్పు, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, జీడిపప్పు – అర కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు – అర కప్పు, పాలు – 2 కప్పులు, నానబెట్టిన సగ్గుబియ్యం – 2 టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి – ఒక టీ స్పూన్.
బెల్లం పాలతాలికల తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో ఒక కప్పు నీళ్లు, ఉప్పు, బెల్లం తురుము వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత బియ్యం పిండి వేసి కలపాలి. తరువాత దీనిపై మూత పెట్టి స5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యం పిండి చల్లారిన తరువాత చేత్తో బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పాల తాలికల్లా వత్తుకోవాలి. తరువాత గిన్నెలో రెండు కప్పుల బెల్లం, అర కప్పు నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని వడకట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించాలి.
తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే కళాయిలో పాలు, మరో రెండు కప్పుల నీళ్లు పోసి పాలను మరిగించాలి. పాలు మరుగుతుండగానే ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల బియ్యం పిండి, నీళ్లు పోసి కలిపి పక్కకు ఉంచాలి. పాలు మరిగిన తరువాత ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కలపాలి. ఈ పాలను మరో 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత పాలతాలికలు వేసి కలపాలి. దీనిని నెమ్మదిగా కలుపుకుని మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమం, యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి కలపాలి. దీనిని మరో 3నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత బెల్లం నీళ్లు పోసి కలపాలి.
దీనిని అంతా కలిసేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం పాలతాలికలు తయారవుతాయి. ఈ పాలతాలికలను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. శరీరం పుష్టిగా తయారవుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పాలు విరగకుండా రుచికరమైన పాలతాలికలను తయారు చేసుకోవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.