Chinthapandu Pulihora : చింతపండు పులిహోర.. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టంగా తింటారు. దీనిని తరచూ ఇంట్లో తయారు చేస్తూ ఉంటాం. అయితే కొందరు ఎంత ప్రయత్నించినప్పటికి ఈ పులిహోరను రుచిగా తయారు చేసుకోలేకపోతుంటారు. పులిహోరను కమ్మగా, తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చింతపండు పులిహోర తయారీకి కావల్సిన పదార్థాలు..
అన్నం – రెండు గ్లాసుల బియ్యంతో వండినంత, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., నూనె – 4 టీ స్పూన్స్, పసుపు -అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, పల్లీలు – గుప్పెడు, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి – 5, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – ఒక టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, ధనియాలు – ఒక టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్.
పులిహోర తయారీ విధానం..
ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. తరువాత చింతపండు నుండి గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పసుపు వేసి వేయించాలి. తరువాత చింతపండు గుజ్జు, కరివేపాకు వేసి కలపాలి. చింతపండు గుజ్జును నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించాలి. తరువాత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చింతపండు గుజ్జును కొద్ది కొద్దిగా అన్నంలో వేసుకుంటూ కలుపుకోవాలి. పులుపు సరిపోయే వరకు ఇలా కలుపుకోవాలి.
తరువాత కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలు వేసి వేయించాలి. దినుసులు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి.తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆప్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్దం చేసుకున్న పులిహోరలో మిక్సీ పట్టుకున్న పొడి, తాళింపు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పులిహోర తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.