Bendakaya Vepudu : బెండకాయలతో కూడా మనం రకరకాల వంటలను చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎక్కువగా వీటితో వేపుళ్లను చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా కూడా కొందరికి బెండకాయ వేపుడు జిగురుగా వస్తుంది. ఒకవేళ బెండకాయ వేపుడును కరకరలాడేలా చేయాలంటే నూనె ఎక్కువగా అవసరమవుతుంది. అలాగే ఇది అన్నంలో కూడా కలవదు. కానీ బెండకాయ వేపుడును కరకరలాడేలా తక్కువ నూనెతో అలాగే అన్నంలో కలిసేలా కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయ వేపుడును కరకరలాడేలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ వెల్లుల్లి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – అర కిలో, నూనె – రెండున్నర టేబుల్ స్పూన్స్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – కారానికి తగినన్ని, ఎండు కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు – 8, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
బెండకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రమైన వస్త్రంతో తుడుచుకోవాలి. తరువాత వీటిని ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయ ముక్కలను వేసి కలుపుతూ వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించాలి. బెండకాయ ముక్కలు వేగిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి.
తరువాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలను వేసి అవి కచ్చా పచ్చగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి కలపాలి. తరువాత పసుపు, ఉప్పుతోపాటు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెండకాయ వెల్లుల్లి కారం తయారవుతుంది. దీనిని అన్నంతోపాటు సాంబార్, రసం వంటి వాటితో కూడా కలిపి తినవచ్చు. ఈవిధంగా చేసిన బెండకాయ వేపుడు అన్నంతో చక్కగా కలవడంతోపాటు కరకరలాడుతూ రుచిగా కూడా ఉంటుంది. ఇలా తయారు చేసిన వెల్లుల్లి కారాన్ని అందరూ ఇష్టంగా తింటారు.