Goja : గోజా.. ఇది ఒక తీపి వంటకం. దీని గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు కానీ బెంగాలీలకు మాత్రం ఈ వంటకం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బెంగాలీలు తయారు చేసే తీపి వంటకాల్లో ఈ గోజా ఒకటి. ఈ తీపి వంటకాన్ని తయారు చేయడం చాలా సలుభం. ఎంతో రుచిగా ఉండే ఈ గోజాను ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగాలీ స్వీట్ గోజా తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదా పిండి – 200 గ్రా., పంచదార – 300 గ్రా., నీళ్లు – 150 ఎమ్ ఎల్, వంటసోడా – పావు టీ స్పూన్, నల్ల జీలకర్ర – అర టీ స్పూన్, నెయ్యి – పావు కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
బెంగాలీ స్వీట్ గోజా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండి, వంటసోడా, నల్ల జీలకర్ర వేసి కలుపుకోవాలి. తరువాత నెయ్యి వేసి అంతా కలిసేలా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని 5 నుండి 10 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి. దీనిపై మూతను ఉంచి పక్కకు పె ట్టకోవాలి. తరువాత ఒక కళాయిలో పంచదార, నీళ్లు పోసి వేడి చేయాలి. పంచదార కరిగిన తరువాత దీనిని తీగ పాకం కంటే కొద్దిగా తక్కువగా గులాబ్ జామున్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి కలిపి చేత్తో చతురస్రాకారంలో ఒక ఇంచు మందం ఉండేలా వత్తుకోవాలి. తరువాత చపాతీ కర్రతో పైన అంతా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీనిని చాకుతో చతురస్రాకారంలో ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను తీసుకుని నాలుగు వైపులా అంచులను సమానంగా వత్తుకోవాలి.
ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో కట్ చేసుకున్న పిండి ముక్కలను వేసి వేయించుకోవాలి. వీటిని చిన్న మంటపై పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇవి పైకి తేలిన తరువాత మంటను మధ్యస్థంగా ఉంచి ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తరువాత వీటిని తీసి పంచదార పాకంలో వేసుకోవాలి. పంచదార పాకం కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. వీటిని అర నిమిషం పాటు పంచదార పాకంలో ఉంచి బయటకు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోజా తయారవుతుంది. తియ్యదనంతో పాటు నల్ల జీలకర్ర రుచి తగులుతూ ఈ గోజాలు చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే తీపి వంటకాలతో పాటు ఇలా ఎంతో రుచిగా ఉండే గోజాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.