Borugula Dosa : బొరుగుల‌తో అప్ప‌టిక‌ప్పుడు మెత్త‌ని దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు..!

Borugula Dosa : మ‌నం బొరుగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. బొరుగుల‌తో మ‌నం ఎక్కువ‌గా ఉగ్గాణి, మిక్చ‌ర్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాము. బొరుగులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఇవే కాకుండా బొరుగుల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. టిపిన్ ఏం చేయాలో తోచ‌న‌ప్పుడు, స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా 10 నిమిషాల్లో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇందులో వంట‌సోడా, పెరుగు, ఇనో పౌడ‌ర్ వంటి వేయాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇన్ స్టాంట్ గా బొరుగుల‌తో రుచిక‌ర‌మైన స్పాంజి లాంటి దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బొరుగుల దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బొరుగులు – 4 క‌ప్పులు, ఉప్మా ర‌వ్వ‌- ఒక క‌ప్పు, బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌.

Borugula Dosa recipe in telugu you can make it easily
Borugula Dosa

బొరుగుల దోశ త‌యారీ విధానం..

ముందుగా బొరుగుల‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. అదే విధంగా ర‌వ్వ‌ను త‌గిన‌న్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. 5 నిమిషాల త‌రువాత ర‌వ్వ‌ను అలాగే బొరుగుల‌ను ఒక జార్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులోనే బియ్యం పిండి, త‌గినన్ని నీళ్లు పోసి పిండిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత పిండిని గిన్నెలోకి తీసుకుని ఇందులో త‌గినంత ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత స్ట‌వ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడ‌య్యాక గంటెతో పిండిని తీసుకుని దోశ‌లాగా వేసుకోవాలి. దోశ త‌డి ఆరిన త‌రువాత నూనె వేసి కాల్చుకోవాలి. దోశ ఒక‌వైపు కాలిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకోవాలి. దోశ‌ను రెండు వైపులా చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకుని చ‌ట్నీతో స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బొరుగుల దోశ త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా అప్ప‌టిక‌ప్పుడు బొరుగుల‌తో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వచ్చు.

D

Recent Posts