Mint Plants : రోజు రోజుకీ కూరగాయల ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. కూరగాయలను కొనలేని పరిస్థితి వస్తోంది. అందుకనే చాలా మంది తమకు ఇంటి ఆవరణలో లేదా బాల్కనీ, డాబాపై ఉండే కాస్త స్థలంలోనే కూరగాయలను, ఆకుకూరలను పెంచేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే అన్ని మొక్కలను మనం ఒకే రకంగా పెంచలేం. వాటిని భిన్న రకాలుగా పెంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పుదీనా మొక్కలను ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా మొక్కలను పెంచేందుకు వాటి విత్తనాలు అవసరం లేదు. కొన్ని పుదీనా మొక్కలు చాలు. వాటిని కింది భాగంలో ఆకులు తీసేసి కాడలు అలాగే ఉంచాలి. అలా కొన్ని పుదీనా మొక్కలను తయారు చేశాక వాటిని ఒకే కట్టగా కట్టాలి. అనంతరం వాటి కాడలు నీళ్లలో మునిగి ఉండేలా చిన్న డబ్బాలో నీళ్లు పోసి ఉంచాలి. అలా వాటిని 5 రోజుల పాటు ఉంచాక పుదీనా కాడలకు వేళ్లు రావడాన్ని గమనించవచ్చు. తరువాత వాటిని కుండీల్లో నాటుకోవచ్చు.
ఇలా వేర్లు వచ్చిన పుదీనా మొక్కలను వేరు చేసి కుండీల్లో నాటాలి. అయితే కుండీలో నీరు పోసినప్పుడు ఆ నీరు కింద నుంచి బయటకు వెళ్లేలా మరో డబ్బాను లేదా ప్లేట్‌ను కుండీ కింద ఉంచాలి. దీంతో నీరు మరీ ఎక్కువ కాకుండా తగినంత ఉంటుంది. ఇలా వేర్లు వచ్చిన పుదీనా మొక్కలను కుండీల్లో నాటాలి. ఇవి మరో 7 రోజుల తరువాత కాస్త పెరుగుతాయి. వాటిని 2 వారాల పాటు అలా పెంచితే చక్కగా ఎదుగుతాయి. దీంతో పుదీనా మొక్కలు రెడీ అయిపోతాయి. వాటిని వాడుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు పుదీనా మొక్కలను నాటుతుంటే మనకు మార్కెట్‌లో బయట పుదీనా కొనాల్సిన పనిలేదు. ఎప్పుడు కావాలన్నా తాజా పుదీనా మనకు మన ఇంట్లోనే లభిస్తుంది. ఈ విధంగా పుదీనా మొక్కలను ఇంట్లోనే ఎంతో సులభంగా పెంచవచ్చు.