Bottle Gourd Dosa : రోజూ మనం రకరకాల బ్రేక్ ఫాస్ట్‌లను చేస్తూ ఉంటాం. ఇడ్లీలు, దోశలు, ఉప్మా.. ఇలా భిన్న రకాల బ్రేక్ ఫాస్ట్‌లను చేసుకొని తింటూ ఉంటాం. ఇందులో దోశ ఒకటి. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఉల్లిపాయ దోశ, మసాలా దోశ, చీజ్ దోశ, ప్లెయిన్ దోశ.. ఇలా దోశల్లో చాలా రకాలు ఉంటాయి. దోశలను మనం ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. మనకు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే దోశలు కూడా ఉన్నాయి. వాటిల్లో సొరకాయ దోశ ఒకటి. దీన్ని చాలా సులభంగా తయారు చేయవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలి.. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
సొరకాయ – ఒకటి, బియ్యం పిండి – ఒకటిన్నర కప్పు, రవ్వ – సగం కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – సరిపడా, తరిగిన ఉల్లిపాయలు – ఒక కప్పు, తరిగిన పచ్చి మిర్చి – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – తగినంత.
సొరకాయ దోశను తయారు చేసే విధానం..
ముందుగా సొరకాయను పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీలో వేసి మెత్తటి గుజ్జుగా చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా చేసి పెట్టిన సొరకాయ గుజ్జు, బియ్యంపిండి, రవ్వ, ఉప్పు వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చి మిర్చి, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనం మీద దోశలా వేసుకొని 3 నిమిషాల తరువాత తీయాలి. దీంతో సొరకాయ దోశ రెడీ అవుతుంది.
ఇలా తయారు చేసుకున్న సొరకాయ దోశను పల్లీలు, కొబ్బరి, టమాటా తదితర చట్నీలతో కలిపి తినవచ్చు. దీంట్లో సొరకాయను ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. కనుక మనకు అనేక రకాల విటమిన్స్, ఐరన్, పొటాషియం అధికంగా లభిస్తాయి. అలాగే ఈ దోశ తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. షుగర్ ఉన్నవారు కూడా నిర్భయంగా ఈ దోశను తినవచ్చు. దీంతో పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి.