Cabbage Pachadi : క్యాబేజిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. క్యాబేజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని కూడా మనం ఆహారంలో భాగంగా తప్పకుండా తీసుకోవాలి. క్యాబేజితో మనం ఎక్కువగా వేపుడు, కూర, పప్పు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా క్యాబేజితో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, అల్పాహారాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా తేలిక. ఎవరైనా చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, రుచిగా ఉండే ఈ క్యాబేజి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర- అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 10 లేదా తగినన్ని, ఎండుమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 5, సన్నగా తరిగిన క్యాబేజి తరుగు – 150 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, చింతపండు – ఉసిరికాయంత, తరిగిన టమాటాలు – పెద్దవి మూడు, ఉప్పు – తగినంత.
క్యాబేజి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత జీలకర్ర, ధనియాలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత క్యాబేజి తరుగు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి క్యాబేజిని పర్తిగా మగ్గించాలి. క్యాబేజి వేగిన తరువాత చింతపండు, టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి పచ్చడి తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజిని తినని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు.