Pesara Punukulu : పెసరపునుగులు.. పెసరపప్పుతో చేసే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తీసుకోవచ్చు. సాయంత్రం సమయంలో బండ్ల మీద స్నాక్స్ గా కూడా ఇవి లభిస్తూ ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ పెసరపునుగులను అందరూ ఎంతో ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. చాలా తేలికగా ఎవరైనా వీటిని తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ పెసరపునుగులను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసరపప్పు – ఒక కప్పు, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం – 2 ఇంచుల ముక్క, ఉప్పు – తగినంత, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పెసర పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసరపప్పును తీసుకోవాలి. తరువాత ఇందులో మినపప్పు వేసి శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును వడకట్టి జార్ లో వేసుకోవాలి. తరువాత ఇందులో అల్లం, ఉప్పు వేసి తక్కువ స్పీడ్ మీద మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా బీట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుంటూ పిండిని తీసుకుని పునుగుల్లా నూనెలో వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు పెద్ద మంటపై కాల్చుకున్న తరువాత మంటను మధ్యస్థంగా చేసి ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పునుగులు తయారవుతాయి. వీటిని అల్లం చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసిన పెసరపునుగులను ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.