Cabbage Shanaga Pappu Vada : శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటితో మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. శనగలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో శనగల వడలు కూడా ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. శనగల వడలు చాలా రుచిగా ఉంటాయి. ఈ వడలను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. శనగలు మరియు క్యాబేజిని కలిపి మరింత రుచిగా ఈ వడలను తయారు చేసుకోవచ్చు. ఈ వడలు కూడా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా క్యాబేజి శనగల వడల తయారీ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజీ శనగ వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగలు – ఒక కప్పు, పచ్చిమిర్చి – 4, అల్లం – ఒక ఇంచు ముక్క, క్యాబేజి తురుము – 2 కప్పులు, ఉప్పు – తగినంత, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, జీలకర్ర – అర టీ స్పూన్, దంచిన ధనియాలు – పావు టీ స్పూన్, బియ్యం – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
క్యాబేజి శనగ వడల తయారీ విధానం..
ముందుగా శనగలను 5 నుండి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ శనగలను జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత క్యాబేజి తురుమును బాగా నలిపి నీరంతా పోయేలా చేత్తో వత్తుకుని పిండిలో వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. ఈ మిశ్రమం పలుచగా ఉంటే మరికొద్దిగా బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక పిండిని తీసుకుని వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ శనగల వడలు తయారవుతాయి. వీటిని చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. బయట లభించే ఇతర చిరుతిళ్లను తినడానికి బదులుగా ఇలా ఇంట్లోనే శనగలతో రుచిగా వడలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.