ఒక సీనియర్ సినీ పాత్రికేయుడు యూట్యూబ్ లో సినిమా హీరోల గురించి మాట్లాడుతూ అందరిలో వెంకటేష్ కి హిట్స్ ఎక్కువ, కానీ మిగతావారిలా ప్రాపగాండా చేసుకోడు, పద్ధతిగా ఉంటాడు, అతి చేయాలి అనే ఆలోచన పెట్టుకోడు. జయాపజయాలకు స్పందించడు. స్టార్ హీరో అనే భావనతో ఉండడు.. అన్నారు. నిజమే కదా అనిపించింది. తన హిట్ సినిమాలు ప్రతి ఒక్కరినీ అలరించినవే. అయినప్పటికీ ఆవేశంగా స్పీచులు ఇస్తూనో, నేనే నంబర్ వన్ అంటూనో ఎప్పుడూ కనబడలేదు. తనకో స్టార్ డమ్ ఉందని గొప్పలు పోలేదు, స్టార్ డమ్ కు కనీస విలువ కూడా ఇవ్వలేదు. తన తర్వాతి తరం వారిని సైతం ప్రోత్సహిస్తూ వారితో సినిమాలు చేస్తూ, ఆ సినిమాలో తన ప్రాధాన్యత తగ్గినా పట్టించుకోక ముందుకు సాగిన వైనం అతడిది.
ఇదిగో ఇదే – కామెడీ టచ్ ఉన్న సినిమాల్లో అతడిని ఎంపిక చేసుకోవడానికి మొదటి కారణం. కామెడీ సినిమాల్లో హీరోయిజం ఉండదు, ఎలివేషన్లు ఉండవు, తన మీద తాను జోకులు వేసుకోవాలి, తనని తాను తగ్గించుకుని హాస్యం పండించాలి. ఆ పని వెంకటేష్ కన్నా ఎవరు బాగా చేయగలరు? రెండవది – అతడు పలికించే హావభావాలు. హాస్యాన్ని సునిశితంగా పండించడంలో అతడిది అందెవేసిన చేయి. అమాయకంగానూ కనబడగలడు, బాధితుడిలానూ కనబడగలడు. అయోమయంతో కొట్టుమిట్టాడే పాత్రలనూ పోషించగలడు. మిగతా పాత్రధారుల చేతిలో బకరాగానూ మారగలడు. ఇమేజ్ చట్రంలో చిక్కుకోకపోవడం వల్ల అలాంటి పాత్రల్లో తేలికగా ఇమిడిపోగలడు. ప్రేక్షకులను మెప్పించగలడు.
అసహజమైన తెలివితేటలున్న హీరోగా కనబడడు, మనలో ఒకడిలా కనబడతాడు. యాక్షన్ సినిమాలతోనో, మాస్ ఎలిమెంట్స్ తోనో ప్రేక్షకులకు దగ్గరవడం కష్టమైన విషయం. కామెడీ ద్వారా మొత్తం ఫ్యామిలీకి దగ్గరయ్యే అవకాశం ఉన్నప్పుడు దర్శకులు ఆ దిశగానే ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. స్టార్ డమ్ తో పాటు పైన చెప్పిన అన్ని అర్హతలు ఉన్న వెంకటేష్ అందుబాటులో ఉన్నప్పుడు దర్శకులకు రెండో ఆలోచన చేయాల్సిన అవసరం కలగదు. మూడవది – రెమ్యూనరేషన్. మిగతా నటులతో పోలిస్తే వెంకటేష్ రెమ్యునరేషన్ తక్కువే అని యూట్యూబ్ కథనాలు. పైగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెంకటేష్ స్వయంగా ఆ మాటని ఒప్పుకున్నాడు. నాలుగోవది – అవసర పడని సెపరేట్ కామెడి ట్రాక్. హీరోనే కామెడి పండించగలిగితే, కామెడీ కోసం ప్రత్యేకంగా ట్రాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కనీసం కొన్ని పాత్రలు తగ్గుతాయి, తద్వారా బడ్జెట్ కూడా ఎక్కువ అవదు. కామెడీ కథలో భాగం అవుతుంది. అలా అవకాశం ఉన్నప్పుడు దర్శకులు కూడా ఆ పంథానే అనుసరిస్తారు. అవే ఆఫర్ చేస్తారు.
అడ్రినలిన్ జంకీస్ కోసం కొన్ని సినిమాలు ఉంటాయి. హీరో కత్తి పట్టుకుని చెరుకుగడను నరికినట్టు విలన్లని నరికేస్తూ ఉంటే, భీభత్సమైన బీజియంతో చెవులు చిల్లులు పడుతూ ఉంటే, నిముషానికో ఎలివేషన్ షాట్ పడుతూ ఉంటే, ఆనందించే ఆ జంకీస్ కి కూడా నచ్చే సినిమాలు వెంకటేష్ మాత్రమే చేయగలడు. స్వర్ణకమలం, శ్రీనివాస కల్యాణం, వారసుడొచ్చాడు, సుందరకాండ, బొబ్బిలి రాజా, చంటి, ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, పవిత్రబంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, రాజా, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ వంటి ఎన్నో హిట్ సినిమాలు. అలాంటి ఎన్నో సినిమాల్లో వెంకటేష్ పండించిన కామెడీ మరిచిపోలేనిది. వెంకటేష్ తన సినిమాలతో కొందరి మనసులు గెలుచుకుంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి నైజంతో మరింత మంది మనసు గెలుచుకున్నాడు. అలా, విక్టరీ వెంకటేష్ అందరివాడు అయ్యాడు.