Cabbage Vepudu : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో క్యాబేజ్ కూడా ఒకటి. క్యాబేజ్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యాబేజితో చేసుకోదగిన వంటకాల్లో క్యాబేజ్ వేపుడు కూడా ఒకటి. క్యాబేజ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ క్యాబేజ్ వేపుడును మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా పొడి వేసి చేసే ఈ క్యాబేజ్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. మసాలా పొడి వేసి మరింత రుచిగా క్యాబేజ్ వేపుడును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాబేజ్ వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన క్యాబేజ్ – అరకిలో, నూనె – 3 టేబుల్ స్పూన్స్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, శనగపప్పు -ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 5 లేదా 6, వెల్లుల్లి రెబ్బలు – 4, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
క్యాబేజ్ వేపుడు తయారీ విధానం..
ముందుగా క్యాబేజిని తురిమిని శుభ్రంగా కడిగి పూర్తిగా నీళ్లు లేకుండా చేసుకోవాలి. తరువాత కళాయిలో శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. ఇప్పుడు వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత పసుపు వేసి కలపాలి. తరువాత క్యాబేజి తురుము వేసి కలపాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ క్యాబేజి మెత్తబడే వరకు ఉడికించాలి.
తరువాత మూత తీసి నీరంతా పోయే వరకు వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజ్ వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే క్యాబేజ్ వేపుడు కంటే ఈ విధంగా తయారు చేసిన క్యాబేజ్ వేపుడు మరింత రుచిగా ఉంటుంది. క్యాబేజ్ ను ఇష్ఠపడని వారు కూడా దీనిని ఇష్టంగా తింటారు.