Vankaya Tomato Curry : మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో వంకాయలు కూడా ఒకటి. వంకాయలల్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వంకాయలతో మనం వివిధ రకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. వంకాయలతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. మనం వంకాయలతో ఎక్కువగా చేసే వంటకాల్లో వంకాయ టమాట కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కూరతో భోజనం చేయడానికి ఇష్టపడతారు. వంకాయ టమాట కూరను నీళ్లు వేయకుండా చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ టమాట కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
వంకాయలు – పావు కిలో, టమాటాలు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి- ఒక టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వంకాయ టమాట కూర తయారీ విధానం..
ముందుగా వంకాయలను తరిగి ఉప్పు, పసుపు వేసిన నీటిలో వేయాలి.తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత వంకాయ ముక్కలు, టమాట ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ముక్కలను మగ్గించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరువాత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు చిన్న మంటపై మగ్గించి కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట కూర తయారవుతుంది. దీనిని అన్నం, రోటి, చపాతీ దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ కూరను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.