Carrot Fry : క్యారెట్ ను మనం ఆహారంగా తీసుకుంటాం. దీనిని తినడం వల్ల శరీరానికి తగినంత విటమిన్ ఎ లభించడంతోపాటు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. క్యారెట్ ను ఇతర వంటకాల్లో ఉపయోగించడంతోపాటు దీనితో ఫ్రై ని కూడా చేసుకుని తింటాం. క్యారెట్ ను తినడానికి ఇష్టపడని వారు కూడా తినేలా క్యారెట్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన క్యారెట్స్ – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, శనగ పప్పు – ఒక టీ స్పూన్, మినప పప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెల్లుల్లి కొబ్బరి కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 8, కారం – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు – పావు కప్పు.
క్యారెట్ ఫ్రై తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత క్యారెట్ ముక్కలను, ఉప్పును, పసుపును వేసి కలపాలి. తరువాత వీటిపై మూతను ఉంచి క్యారెట్ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
క్యారెట్ ముక్కలు పూర్తిగా ఉడికిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి కలపాలి. దీనిపై మూతను ఉంచి మరో రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత కొత్తిమీరను పైన చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ ఫ్రై తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ తో ఇలా ఫ్రై ని చేసుకుని తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు.