Carrot Nimmakaya Karam : క్యారెట్లు, నిమ్మ‌కాయ‌ల‌తో ఇలా చేసి అన్నంలో వేడిగా తినండి.. ఎంతో బాగుంటుంది..!

Carrot Nimmakaya Karam : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క్యారెట్ లో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. క్యారెట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది. బ‌రువు త‌గ్గ‌డంలో కూడా క్యారెట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం ఎక్కువ‌గా క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటూ ఉంటాము.

అలాగే క్యారెట్ ను తురుముగా చేసిలేదా ముక్క‌లుగా క‌ట్ చేసి వంట‌ల్లో, స‌లాడ్స్ లో వాడుతూ ఉంటాము. ఇత‌ర వంటల్లో వాడ‌డంతో పాటు క్యారెట్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే క్యారెట్ నిమ్మ‌కాయ కారాన్ని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క్యారెట్ తో చేసే ఈ వంట‌కం పుల్ల పుల్ల‌గా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని కేవ‌లం 10 నిమిషాల్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే క్యారెట్ నిమ్మ‌కాయ కారాన్ని ఇన్ స్టాంట్ గా, సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Carrot Nimmakaya Karam recipe in telugu make like this
Carrot Nimmakaya Karam

క్యారెట్ నిమ్మకాయ కారం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

క్యారెట్ – 300 గ్రా., ఉప్పు – త‌గినంత‌, కారం – పావు క‌ప్పు, నూనె- 4 స్పూన్స్, ఆవాలు -ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 4, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, నిమ్మ‌కాయ‌లు – 3.

క్యారెట్ నిమ్మకాయ కారం త‌యారీ విధానం..

ముందుగా క్యారెట్ పై ఉండే చెక్కును తీసేసి క్యారెట్ లను తురుముకోవాలి. త‌రువాత క్యారెట్ తురుమును ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత తాళింపుకు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఎండుమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న క్యారెట్ తురుమును వేసి క‌ల‌పాలి. దీనిని రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఇందులో నిమ్మ‌ర‌సం వేసి అంతా క‌లిసేలా క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ నిమ్మ‌కాయ కారం త‌యారవుతుంది. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వంట చేయ‌డానికి స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు ఇలా క్యారెట్ నిమ్మ‌కారాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts