Drying Clothes In Rainy Season : వర్షాకాలంలో మనం ఎదుర్కొనే సమస్యల్లో బట్టలను ఆరబెట్టడం కూడా ఒకటి. ఎండాకాలంలో బట్టలు కొన్ని గంటల్లోనే ఎండిపోతాయి. కానీ వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. ముఖ్యంగా జీన్స్ వంటి మందపాటి వస్త్రాలు ఆరడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే బట్టలు సరిగ్గా ఆరక వాటి నుండి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ సమస్యను మనలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. బట్టలను ఆరబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని పద్దతులను పాటించడం వల్ల మనం చాలా సులభంగా వర్షాకాలంలో కూడా బట్టలను ఆరబెట్టుకోవచ్చు.
చాలా మంది బట్టలను వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం చేస్తూ ఉంటారు. దీని వల్ల బట్టలు దాదాపుగా నీళ్లని పిండేసినట్టుగా నే బయటకు వస్తాయి. అదే చేత్తో శుభ్రం చేసుకునే వారైతే బట్టలను పూర్తిగా నీళ్లు లేకుండా పిండేసుకోవాలి. బట్టలను ఆరేసిన తరువాత నీరు కారకుండా చూసుకోవాలి. తరువాత ఈ బట్టలను తీగలపై ఒకదాని పక్కకు ఒకటి వేయాలి. ఒక దానిపై ఒకటి అస్సలు వేయకూడదు. బయట వీలు కాదు కాబట్టి బట్టలు ఆరవేయడానికి తీగలను ఇంట్లోనే కట్టుకోవాలి. ఇలా వీలు కాని వారు బట్టలను ఆరవేసే స్టాండ్ లపై వీటిని ఆరవేయాలి. అలాగే బట్టలను ఫ్యాన్ గాలి తగిలేలా ఆరవేయాలి లేదా ఎక్కువగా గాలి తగిలే చోట ఆరవేయాలి. అలాగే ఇంట్లోకి తాజా గాలి ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి.
ఇలా చేయడం వల్ల బట్టలు ఆరడంతో పాటు వాసన రాకుండా ఉంటాయి. అదే విధంగా ఆరేసిన బట్టలు వాసన రాకుండా ఇంట్లో చక్కటి వాసన వెదజల్లేలా స్ప్రే చేయాలి లేదా ధూపం వేయాలి. అలాగే బట్టలు చక్కటి వాసన వచ్చేలా ఫ్యాబ్రిక్ కండీష్ నర్ లను వాడాలి. అలాగే ఇంట్లో తేమ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. బట్టలు ఆరబెట్టిన చోట ఎయిర్ ఫ్యూరీ ఫైర్ బ్యాగులను ఉంచాలి. అలాగే తేమను పీల్చుకునేలా ఉప్పును ఉంచాలి. ఇంట్లో సాధ్యమైనంత వరకు పొడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అలాగే చిన్న చిన్న బట్టలను, వస్త్రాలను హెయిర్ డ్రైయర్ లను ఉపయోగించి మనం సులభంగా ఆరేలా చేసుకోవచ్చు. అలాగే బట్టలను ఐరన్ చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా బట్టలను ఆరబెట్టుకోవచ్చు.