Chicken 65 : చికెన్ ను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ తో చేసిన వంటకాలను తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. చికెన్ తో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చికెన్ తో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. చికెన్ తో రుచిగా, సులభంగా చేసుకోదగిన వంటకాల్లో చికెన్ 65 ఒకటి. చికెన్ తో చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. మనలో చాలా మంది రెస్టారెంట్ లలో దీనిని రుచి చూసే ఉంటారు. అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 ను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే చికెన్ 65 ను మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
బోన్ లెస్ చికెన్ – 300 గ్రా., బీట్ చేసిన కోడిగుడ్డు మిశ్రమం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – కొద్దిగా, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, మైదాపిండి – 2 టీ స్పూన్స్, నీళ్లు – 3 టేబుల్ స్పూన్స్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, ఉల్లిపాయ తరుగు – 2 టేబుల్ స్పూన్స్, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, కరివేపాకు – రెండు రెబ్బలు, చిలికిన పెరుగు – అర కప్పు, నిమ్మరసం – అర టీ స్పూన్, రెడ్ ఫుడ్ కలర్ – అర స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
చికెన్ 65 తయారీ విధానం..
ముందుగా చికెన్ ను ఉప్పు నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత చికెన్ ను నీళ్లు లేకుండా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో కోడిగుడ్డు మిశ్రమం, ఉప్పు, కార్న్ ఫ్లోర్, మైదాపిండి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి పిండి ముక్కలుకు పట్టేలా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చికెన్ ను వేసి మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకోవాలి. చికెన్ ను చక్కగా వేయించుకున్న తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, కరివేపాకు వేసి వేయించాలి.
తరువాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసి కలపాలి. తరువాత నిమ్మరసం, రెడ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి వేయించిన చికెన్ వేసి కలపాలి. మసాలాలన్నీ చికెన్ కు పట్టేలా పెద్ద మంటపై టాస్ చేసుకోవాలి. చికెన్ కు మసాలాలు చక్కగా పట్టిన తరువాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ 65 తయారవుతుంది. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో చికెన్ తో ఈ విధంగా చికెన్ 65 ను తయారు చేసుకుని తినవచ్చు. దీనిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.