Curry Leaves For Hair : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన జీవన విధానం, మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత ఎదురయ్యే సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలడంతో పాటు జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం, జుట్టు తెగిపోవడం, జుట్టు తెల్లబడడం వంటి వివిధ రకాల సమస్యలతో బాధపడే వారు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేక సతమతమయ్యే వారు మనలో చాలా మంది ఉన్నారు. కేవలం ఇంటి చిట్కాను ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా తక్కువ ఖర్చులో మనం జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.
జుట్టు సమస్యలను తగ్గించడంలో మనకు కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చన్న సంగతి మనకు తెలిసిందే. శరీర ఆరోగ్యంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కరివేపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు జుట్టు ఆరోగ్యానికి అవసరమయ్యే బీటా కెరోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కరివేపాకును ఆహారంలో తీసుకోవడంతో పాటు దానితో కొన్ని రకాల చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల మనం జుట్టు ఒత్తుగా పెంచుకోవచ్చు. కరివేపాకుతో చిట్కాలను ఎలా తయారు చేసుకోవాలి..ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల పెరుగును తీసుకోవాలి. తరువాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కరివేపాకు పేస్ట్ ను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కావల్సిన పోషకాలతో పాటు తేమ కూడా అందుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే నీటిలో కరివేపాకును వేసి కషాయంలా తయారు చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత తాగాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల శరీరంలో రక్తం శుద్ధి అవుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీంతో జుట్టుకు రక్తప్రసరణ చక్కగా జరిగి జుట్టు పెరుగుదలకు కావల్సిన పోషకాలు అందుతాయి.
దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. అలాగే ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ గోరు వెచ్చని ఆలివ్ నూనెను తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు పట్టించాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది. జుట్టు సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు కరివేపాకును ఈ విధంగా ఉపయోగించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.